ఒక చోట మ్యాజిక్ చేసిన సినిమా… మరో చోట అంతకుమించి ఫలితం అందుకోవడం అరుదు. అయితే, అలాంటి ఫీట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు సందీప్ రెడ్డి వంగా. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ని… హిందీలో ‘కబీర్ సింగ్’గా రూపొందించి అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
భారీ విజయంతో పాటు వివాదాల పాలైన ఈ సినిమాతో… బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సందీప్. ఈ క్రమంలోనే… ఓ బడా ఆఫర్ తన చెంతకు రావడం జరిగింది. అయితే, ఆ అవకాశం అందించిన సంబరం ఇట్టే కాలం నిలవలేదట.
అన్నీ కుదిరితే, సందీప్ రెడ్డి సెకండ్ బాలీవుడ్ వెంచర్… రణ్ బీర్ కపూర్ తో చేయాల్సింది. అయితే, టీ సీరీస్ లాంటి అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… సబ్జెక్ట్ డిమాండ్ మేరకు ఇమేజ్ ఉన్న స్టార్ తోనే తీయాలి. కాకపోతే, అక్కడి యంగ్ స్టార్స్ అంతా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ. వారి కాల్షీట్స్ దొరకాలంటే ఏడాదికి పైగా వేచిచూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో… అంత కాలం ఆగలేక టీ సీరీస్ ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేసిందట. కాకపోతే, ఆ స్థానంలో మరో ప్రతిపాదికను సందీప్ ముందు ఉంచిందట టీ-సీరీస్.
‘కబీర్ సింగ్’ను టీ సీరీస్ సంస్థనే నిర్మించింది. ఆ సినిమాతో మంచి లాభాలను చూసిన సదరు సంస్థ… సందీప్ నెక్స్ట్ వెంచర్ ని కూడా తామే నిర్మించాలని డిసైడ్ అయింది. అయితే, కథానాయకుల లేమితో కొత్త చిత్రం ఆగిపోవడంతో… సందీప్ ని నిరాశపరచడం ఇష్టం లేక… ఓ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని ఆఫర్ చేసిందట టీ సీరీస్. ఈ నేపథ్యంలోనే… హిందీవారికీ సుపరిచితుడైన ఓ తెలుగు స్టార్ తో ఈ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా… బాలీవుడ్ బడా స్టార్ తో సందీప్ జాతకం మారుతుందనుకుంటే… కాలం వ్యూహం మరోలా ఉందన్న మాట. మరి… అందివచ్చిన బైలింగ్వల్ తోనూ తనేంటో నిరూపించుకుని… నాలుగో చిత్రంతో హిందీ బడా స్టార్ ని సందీప్ డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి.