బాపట్ల (DN5 News) : రీ సర్వే జరుగుతున్న గ్రామాలలో ఉప తహశీల్దారు, సర్వేయర్ల డిప్యూటేషన్ రద్దు చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ, తదితర అంశాలపై రాష్ట్ర రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రీ సర్వే జరిగే గ్రామాలలోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ ప్రక్రియ వేగంగా చేపట్టాలని అన్నారు. ఐవిఆర్ఎస్‌లో అధిక శాతం సాధించేలా ప్రభుత్వ సేవలు ఉండాలని అన్నారు. ప్రజలకు మేలు జరిగేలా అధికారులు పనిచేయాలని అన్నారు.
బాపట్ల జిల్లాలోని 10 గ్రామాలలో రీ సర్వే ప్రక్రియ సాగుతుందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. 6,400 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,287 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. మిగిలిన పట్టాదారు పాసు పుస్తకాలు తక్షణమే అర్హులైన ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ఈకెవైసీ ప్రక్రియ 68.32 శాతానికి చేరిందని అన్నారు. బాపట్ల జిల్లా రాష్ట్రంలోని 5వ స్థానంలో నిలిచిందన్నారు.
సమావేశంలో సిసిఎల్ఎ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, భూములు రికార్డుల శాఖ ఎడి శేషగిరిరావు, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ పర్యవేక్షకులు షఫీ పాల్గొన్నారు.






