టంగుటూరు : రాష్ట్రమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై టిడిపి నాయకులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలని వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న చెన్నైలో పోలీసులకు దొరికిన రూ.ఐదు కోట్ల డబ్బులు ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు తన బంగారం వ్యాపారానికి సంబంధించిన డబ్బులని పత్రికాముఖంగా ఆధారాలతో చెప్పినప్పటికీ టిడిపి నాయకులు జనార్ధన్ మంత్రి బాలినేనికి సంబంధించిన డబ్బులని అవివేకంతో వారికి చెందిన పత్రికలు, అనుకూల చానల్స్ ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాలు,
అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మంత్రి వాసన్న 30సంవత్సరాల ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చలేకుండా, నిత్యం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఏకైక నాయకుడు కాబట్టే ఐదు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజానాయకుడైన వాసన్నను విమర్శించడం తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్నారు. జిల్లా ప్రజలు కరోనా మహమ్మారితో నాలుగు నెలల నుండి ఎంతో ఇబ్బంది పడుతుంటే, కనీసం ఒంగోలు వచ్చి, ఒంగోలు ప్రజలు ఎలా ఉన్నారో అని తెలుసుకునే పరిస్థితిలో కూడా దామచర్ల జనార్ధన్ లేరన్నారు. తమ నాయకుడైన వాసన్న నిత్యం ప్రజల మంచి చెడ్డలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందుల గురించి నిత్యం అధికారులతో మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచిన నాయకుడిని విమర్శించడం జనార్దన్ కి తగదన్నారు. జనార్దన్ తప్పును తెలుసుకుని మంత్రి వాసన్నకు పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టంగుటూరు సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైసీపీ నాయకులు సూదనగుంట నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు చింతపల్లి హరిబాబు, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, ఉప్పలపాటి సుబ్బరాజు, దండేల వినోద్, తేళ్ల డేవిడ్, శారీమందిర్ వెంకటేశ్వర్లు, బొడ్డు రవీంద్ర, మిడసల మాధవరావు, దాసరి సుబ్బారావు పాల్గొన్నారు.