టంగుటూరు : నీతీ నిజాయితీలకు నిలువెత్తు సాక్ష్యంగా తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మన్ననలను పొందిన గొప్ప నాయకుడు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు అని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 13వ వర్ధంతి సందర్భంగా కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి.
ముందుగా దామచర్ల ఆంజనేయులు స్వగ్రామమైన టి.నాయుడు పాలెంలోని ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి, టీడీపీ జిల్లా నాయకులు దామచర్ల సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండేపి టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని చెప్పారు. వల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా, ఆతరువాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు కొండేపి శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మంత్రివర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కొండపి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఆ అభివృద్ధిలో కొన్ని చెప్పుకుంటే కొండేపి టొబాకో బోర్డు, గురుకులపాఠశాల, ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు, రక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్టు ఆయన సమయంలోనే నిర్మాణం జరిగాయన్నారు.
నియోజకవర్గంలోని అభివృద్ధికి దామచర్లకు పూర్వం దామచర్లతో పాటు అభివృద్ధి జరిగిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. జిల్లాలో దామచర్లతో పాటు మంత్రులుగా చేసిన వారు జిల్లాలో చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళకెవరికి ఇంతటి గౌరవం దక్కలేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా దామచర్లకు నివాళులర్పించడం ఆయన చేసిన సేవలకు నిదర్శనం అన్నారు. ఆయన ప్రజల మనిషిగా, రైతు బాంధవుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆయన అడుగు జాడల్లో వారి కుమారులు పూర్ణచంద్రరావు, మనుమళ్ళు జనార్ధన్, సత్యతో పాటు తాను కూడా నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు వదిలి వెళ్ళిన అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. ఆయన బాటలో పయనిస్తూ గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన ఆశయాలకు పునరంకితులమై పనిచేయనున్నట్లు తెలిపారు.
దామచర్ల సత్య : తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు
“మా తాతయ్య మరణించి పదమూడేళ్ళు గడిచిపోయినా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉన్నాడు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలలో ఎంతో వ్యత్యాసం ఉంది. నీతి నిజాయితీకి, నిబద్ధతతో, విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారు. ప్రజల పనులను తన సొంత పనుల వలే తపనతో హైదరాబాద్ సైతం వెళ్లి ప్రజలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు దామచర్ల ఆంజనేయులు. అటువంటి గొప్ప వ్యక్తి వంశంలో పుట్టడం, ఆయనకు మనుమలుగా పుట్టడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం.” అని అన్నారు. కార్యక్రమాలలో టంగుటూరు మండల మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, మండలంలోని టీడీపీ నాయకులు కామని విజయకుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, రామా గోపి, ఈదర ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రగడ్డ అనిల్, పిడుగురాళ్ల సురేష్ బాబు, శ్రీరామమూర్తి, ఎం శ్రీనివాస్, రవీంద్ర, బాలకోటయ్య, భాస్కర్, రమేష్, కొండపి మండలంలో ఎఎంసి మాజీ చైర్మన్ రామయ్యచౌదరి, మాజీ వైఎస్ ఎంపీపీ మధుసూదనరావు, టీడీపీ నాయకులు సుబ్బరామయ్య, బోదాటి సోమయ్య, యనమదిని వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు(పెద్దబ్బాయి), నారాయణ స్వామి, కిరణ్, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల్లో ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.