Home ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిఎ చెల్లింపు : ఏపీ మంత్రివర్గం నిర్ణ‌యం

రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిఎ చెల్లింపు : ఏపీ మంత్రివర్గం నిర్ణ‌యం

339
0

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం బుధ‌వారం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సుమారు మూడు గంటలకు పైగా స‌మావేశం జ‌రిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 2017 నుండి 2018 మార్చి 31 వరకు 2.096 శాతం డీఏ చెల్లించాలని నిర్ణ‌యించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1048.60 కోట్ల భారం పడనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం, ఆ తర్వాత మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఇదివరకే చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనిపై మంత్రివర్గం చర్చించి ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్‌ పనులు చేపట్టిన నవయుగ సంస్థకు రూ.1244 కోట్లు నిధుల‌కు పరిపాలన అనుమతులకు ఆమోద ముద్ర వేశారు. అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం పచ్చజెండా వూపింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించిన‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.