నిజామాబాద్ : తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజాంబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీని మోసం చేయడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం తనకు తెలియదన్నారు. తెలంగాణ పట్ల తనకున్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. తనపై లేనిపోని నిందలు వేసి పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు పనిగట్టుకుని కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు నమోదు చేయించారని ఆరోపించారు. తన మరో కుమారుడు అరవింద్ బిజెపిలో చేరడంలో తన ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పారు. తానెప్పుడూ బిజెపికి అనుకూలంగా మాట్లాడలేదన్నారు. తన సహచరులను కూడా బిజెపిలోకి ప్రోత్సహించలేదన్నారు. అదే విషయాన్ని కేసీఆర్‌కు రెండుసార్లు చెప్పానన్నారు. పార్టీలో తానుండటం జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయించాలని కోరారు. అది వీలుకాకుంటే తనపై పెట్టిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.