బాపట్ల (DN5 News) : ప్రభుత్వం నిర్ణయించి ధర కంటే గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వసూలు చేస్తే ఆ గ్యాస్ ఏజెన్సీలపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఆర్ జమీర్ భాష ఆదివారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీల్లో 6,027 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలను సిఎస్ డిటీలు, తహశీల్దార్లు తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్‌పిజి గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని తెలిపారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని తెలిపారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో45 రోజులు తర్వాత మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.
బుక్ చేసిన 7 రోజుల్లోగా సిలిండర్ వస్తుందని అన్నారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదని సూచించారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని చెప్పారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను (14.21 కేజీ) వాణిజ్య అవసరాల కోసం తరలించిన, వినియోగించిన అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






