విజయవాడ : రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తిపికొట్టాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో రెండో రోజైన శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా విస్తృతంగా నిరసన, ప్రచార ఉద్యమం నిర్వహించాలని సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటించిందన్నారు. ఎపి, తెలంగాణలోనూ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేసే పనులను శరవేగంగా చేపడుతో దని అన్నారు. దీన్ని దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా
సిపిఎం భావిస్తోందన్నారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35a(ఎ) అధికరణలను రద్దు చేయడం, రాజ్యాంగం వివిధ తరగతులు, ప్రాంతాలకు ఇచ్చిన రాయితీలపై బిజెపి దాడులకు తెగబడుతోందని వివరించారు. అది జమ్మూ, కాశ్మీరు మాత్రమే కాదు దేశంలోని అన్ని ప్రాంతాలు, తరగతులపైకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే అనేక ప్రాంతాలకు రాజ్యాంగం భూములు, ఉద్యోగాలు, నియామకం విషయంలో ప్రత్యేక రాయితీలను ఇచ్చిందని తెలిపారు. కాశ్మీర్ కు ఇచ్చిన ప్రత్యేక రాయితీలను కేంద్రం పూర్తిగా రద్దు చేసిందని అన్నారు. మహారాష్ట్రలో రాజ్యాంగ వ్యవస్థను కేంద్ర పక్కన బెట్టి, పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. గవర్నర్, రాష్ట్రపతి, ప్రధాని వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి మహారాష్ట్ర వీఠాన్ని దక్కించుకోవాలని చూసిందని, అది సాధ్యంగాక పక్కకు తప్పుకుని అవమానం పాలయ్యిందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడం అందోళనకరమైన పరిణాసమని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు సీరియస్ గా తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుకురావాలని కోరారు.
Home ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం దాడి : సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు