Home ఆంధ్రప్రదేశ్ అమరావతిని ప్రజారాజధానిగా నిర్మాణం చేయాలి : సిపిఎం

అమరావతిని ప్రజారాజధానిగా నిర్మాణం చేయాలి : సిపిఎం

31
0

బాపట్ల : ప్రజోపయోగ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని, బాపట్ల మెడికల్ కాలేజీ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు వై నేతాజీ డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతున్న సందర్భంగా మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో ప్రారంభమైన ప్రచార జాత శుక్రవారం బాపట్ల వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

సిపిఎం జాతాకు సిపిఎం బాపట్ల నాయకులు గులాబీ పూలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. పాత బస్టాండ్ సెంటర్లోని కామ్రేడ్ చివుకుల శేషశాస్త్రి స్థూపానికి పూలమాలు వేసి తొలుత నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో సభ నిర్వహించారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు వై నేతాజీ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి అప్పు కాకుండా కేంద్రమే నిధులు భరించాలని కోరారు. అమరావతి రాజధాని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని అన్నారు. వైసిపి ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులని చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణ అంశంపై అనిశ్శితి తలెత్తకుండా సమగ్ర చట్టం తీసుకురావాలని అన్నారు.

రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలో ఉందని, కేంద్రంలో టిడిపిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి గ్రాంటుగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రూ.30వేల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. ప్రజా రాజధాని నిర్మించకపోతే రాజధాని రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.

సిపిఎం రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం రవి మాట్లాడుతూ మిగతా ప్రాంతాలతో పోల్చితే రాజధాని ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని అన్నారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మున్సిపల్ కార్మికులకు రూ.21వేలు వేతనం అందుతుంటే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజధాని గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు మాత్రం రూ.12వేలు ఇస్తున్నారని అన్నారు.

రాజధానిలో సిఆర్‌డిఎ కార్యాలయాలు శాశ్వత మైనవని, వాటిల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులను మాత్రం ఔట్ సోర్సింగ్ పేరుతో తక్కువ వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు ఎక్కువగా ఉండడం సమస్యగా ఉందన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. తుళ్లూరులోని ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరగాలన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ అభివృద్ధికి గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ ఒకే విధానంలో ఉండటం వల్ల అభివృద్ది జరగడం లేదని ఆరోపించారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముఖ్యమైన శాఖలకు మంత్రులుగా ఉండీ కూడా వైద్య కళాశాల పనులు ప్రారంభించలేదని అన్నారు. వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించి పర్చూరు ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరారు.

జిల్లాలో గతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకున్న వానపిక్ భూముల్లో పరిశ్రమలు స్థాపించాలని కోరారు. గ్రామాల్లో మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ఒక్కరోజులో రూ.కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా నాయకులు పి కొండయ్య, కె శరత్, ఎన్ కోటేశ్వరావు, కె నాగేశ్వరావు, బుచ్చిరాజు, వై శ్రీనివాస్, బొనిగల సుబ్బారావు, దేవరకొండ శీను పాల్గొన్నారు.