గుడివాడ : ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ ఉన్న రోడ్డును వెంటనే నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్‌సిపి రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ స్టేడియం ఆటలకి పుట్టినిల్లుగాను, ఉల్లాసాన్ని కల్పించడానికి ఆనాటి ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ నుంచి కొంత డబ్బు వచ్చినా ఎక్కువ డబ్బు కోసం లాటరీ వేసి ఆ లాటరీ మీద వచ్చిన లాభాలతో స్టేడియంను నిర్మించారని అన్నారు. కానీ అలాంటి స్టేడియం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ ఉండటం వలన రూ.కోట్ల అద్దె స్టేడియంకి వస్తుందని తెలిపారు. ఆ నిధులతో పిల్లలు ఆడుకునే ప్రదేశంలో పార్క్, మళ్లీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని అన్నారు. ఆ రోజు నిర్మించినప్పుడు స్టేడియం అభివృద్ధికి, అట్లాగే అక్కడ ఉద్యోగస్తుల అభివృద్ధికి నిధులు సరిపోక స్టేడియంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నామనీ, ఇంకా స్పోర్ట్స్ పెంచుతూ పిల్లలకే ఫెసిలిటీస్ పెంచుతామని ఆ రోజు చెప్పిన మాటలు గుర్తు చేశారు. కానీ ఇప్పటికే ఇటు షాపింగ్ కాంప్లెక్స్ అటు షాపింగ్ కాంప్లెక్స్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు చాలా ఇరుకైపోయిందని అన్నారు. అంతే కాకుండా స్టేడియం చుట్టూ ఉన్న రోడ్డు చాలా పాడైపోయింది కాబట్టి ఆ రోడ్డుని కొత్త రోడ్డుగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రోజూ వందలమంది స్టేడియంలోని వాకింగ్ ట్రాక్ లో స్టేడియం చుట్టూ తిరుగుతారని తెలిపారు. కాబట్టి ఆ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని అన్నారు. రైతు బజార్‌కు వచ్చే వాళ్ళుగాని, రోజు వేలాదిమంది స్టేడియం చుట్టూ వాకింగ్‌కు వస్తుంటారని తెలిపారు. కాబట్టి స్టేడియం కమిటీ తక్షణం ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరాఉ. కార్యక్రమంలో సిపిఎం టౌన్ కమిటీ సభ్యులు పి రజిని, సిపిఎం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.