Home ఆంధ్రప్రదేశ్ ఆ మూడు శాఖలే టార్గెట్ – ఎసిబి అధికారుల దందాలు

ఆ మూడు శాఖలే టార్గెట్ – ఎసిబి అధికారుల దందాలు

718
0

– ఎసిబి అధికారులను దొంగలతో పోల్చిన ఉపముఖ్యమంత్రి పిల్లి సుబాష్‌చంద్రబోస్‌
– అవినీతి శాఖల అధికారులే వారి టార్గెట్‌
– ఎసిబికి ఉన్న అధికారాలను అడ్డంపెట్టుకుని వసూళ్ల దందాలు
– ఉక్కిరిబిక్కిరి అవుతున్న మూడు ప్రధాన శాఖల అధికారులు
– ఎసిబిలో దిగువస్థాయి అధికారులే వసూళ్ల రాజాలు

ఎసిబి గురించి ఎవ్వరికీ తెలియనిది కాదు. అవినీతి అధికారులకు గుండెల్లో దడ. అలాంటి ఎసిబి అధికారులే అవినీతికి తెరలేపితే ఎలా ఉంటుంది. విశాఖ జిల్లాలో ఎసిబి అధికారుల తీరుపై సాక్ష్యాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తీవ్రంగా స్పందించారు. ఎసిబి అధికారులకన్నా దారిదోపిడీ దొంగలే నయమంటూ వ్యాఖ్యానించారు. ఇది ఒక్క విశాఖ జిల్లాలోనే కాదు. ఎసిబి అధికారుల పనితీరు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు వ్యక్తమవుతుంది. అవినీతిలో సాధారణంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ, మోటారు వాహన తనిఖీలు, కమర్షియల్‌ టాక్స్‌ కార్యాలయాలతోపాటు అక్కడక్కడ మున్సిపల్‌ కార్యాలయాలను, ఇతర ఇంజనీరింగ్‌ ప్రభుత్వ అధికారులను టార్గెట్‌ చేస్తుంటారు. అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్న శాఖలు కూడా ఇవే. అలాంటి శాఖల్లో అధికారుల అవినీతిని నియంత్రించేందుకు ఎసిబి అధికారులకు మూడు రకాల అధికారాలను ఇచ్చారు.

ఎవరైనా అధికారులు లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేస్తే అలాంటి అధికారులను ట్రాప్‌ చేయడం ఒక పద్దతి. ఏ శాఖలోనైనా పనిచేసే అధికారులు ఆదాయానికి మించిన ఆస్థులు ఉన్నట్లు సమాచారం అందితే ఏకకాలంలో సంబంధిత అధికారి ఇళ్లు, బంధువుల ఇళ్లతోపాటు ఆఫీసులో తనిఖీలు చేయడం ఒకపద్దతి. ఇకపోతూ మూడో పద్దతి ఆకస్మిక తనిఖీలు. ఇదే అవకాశంగా చేసుకున్న ఎసిబి అధికారులు వసూళ్లకు తెరతీస్తున్నారు. రోజువారీ ఆర్ధిక లావాదేవీలు, అవినీతి చేసేందుకు అవకాశాలున్న రిజిస్ర్టేషన్‌, రవాణా, సిటిఒ లేక చెక్‌పోస్టులనే టార్గెట్‌ చేసుకుని ఎసిబి అధికారులు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అధికారులనైతే నెలకు లక్షల్లో ఇవ్వాలని ఎసిబి అధికారులనుండి వత్తిడి ఉందని మదనపడుతున్నారు. ఎసిబి అధికారుల డిమాండ్‌ను అంగీకరించని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై సర్ప్రైజ్‌ విజిట్‌ (ఆకస్మిక దాడి) చేసి ఎసిబి అధికారులే ఏదో ఒక మూలన డబ్బు పడేసి సంబంధిత అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎసిబిలో హెడ్‌కానిస్టేబుల్‌ నుండి కొన్ని జిల్లాల్లో డిఎస్‌సి స్థాయి అధికారుల వరకు ఇదే తరహా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలను ఎసిబి శాఖ ఎదుర్కొంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క హెడ్‌కానిస్టేబుల్‌ గత ఐదేళ్లుగా ఇదే విధుల్లో ఉంటూ ఎలాంటి బదిలీలు లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌, ఎంవిఐ, సిటిఒలనుండి నెలమామూళ్లు లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ చేసిన వ్యాఖలు నిజమనిపిస్తున్నాయి.

ఎసిబిలో జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు వీలుగా సెంట్రల్‌ ఇన్విస్టిగేషన్‌ యూనిట్‌ (సిఐయు) ఉపవిభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈ విభాగం రాష్ట్రంలో అత్యధికంగా అవినీతికి పాల్పడుతున్న కార్యాలయ అధికారులనుండి పెద్దమొత్తంలో వసూళ్లు చేస్తూ అవినీతిని వీళ్లే చట్టబద్దం చేస్తున్నారనే విమర్శ ఉంది.

ప్రకాశం జిల్లాలో అవినీతి నిరోధక శాఖలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఐదేళ్లకుపైగా అదే విధుల్లో ఉన్నాడు. జిల్లాలో ఎసిబి అధికారులు ఎక్కడికి రైడ్‌కు బయలుదేరినా సబంధితర అధికారులకు అతనే ముందస్తు సమాచారం లీక్‌ చేస్తాడనే గుర్తింపు ఉంది. ముందస్తు సమాచారం ఇస్తున్నందుకు దానికి తగిన పారితోషకం అతను వసూళ్లు చేస్తాడని ఉంది. ఎసిబిలో ఉన్నతాధికారులకన్నా ఆ హెడ్‌ కానిస్టేబుల్‌ పేరు చెబితేచాలు జిల్లాలో అవినీతి అధికారులకు ‘చంద్ర’బింభం కనిపిస్తుంది. అంతే గుట్టుచప్పుడు కాకుండా అడిగినంత సమకూర్చుతారని ప్రభుత్వ కార్యాలయాల్లో మంచి గుర్తింపు ఉంది.

నెల్లూరు జిల్లాలోనూ ఎసిబి అధికారులకు మంచి గుర్తింపే ఉంది. జిల్లాకే ఏ కొత్త ఎసిబి అధికారి వచ్చినా ఆ జిల్లాలో అవినీతికి అవకాశం ఉన్న అధికారులనుండి ‘మధు’పానం కన్నా ‘మధు’రంగా మూటలు అందుతాయనే చర్చ ఉంది. జిల్లా కొచ్చే అధికారులకు అక్కడ సుధీర్ఘ కాలం విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ సూచనలతోనే విధులు నిర్వహిస్తారనే ఆరోపణ ఉంది. ఎందుకంటే దాడిచేసి కేసులు పెడితే ఏమొస్తుంది. బెదిరించి వసూళ్లు చేస్తే మజా ఉంటుంది. అనేది వీరి ఎత్తుగడనే ఆరోపణ ఉంది.

కృష్ణాజిల్లాలో ఎసిబి అధికారులు ఎంత సు’కుమారం’గా ఉంటారో వీరి పనితీరు చూస్తే అర్ధమవుతుంది. విజయవాడ నగరం రాష్ట్రానికే వ్యాపార కేంద్రం. అలాంటి ఆర్ధిక ఆయువు పట్టయిన నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులే అవినీతికి తెరతీస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ పనిచేస్తే ఎసిబి అధికారుల అదనపు ఆదాయం అంటే వసూళ్లు నెలకు రూ.25లక్షలకుపైనే ఉంటాయని అవినీతి మార్గాలపై అవగాహన ఉన్న అధికారులు అంచనాలు వేస్తున్నారు. అవినీతికి అవకాశాలు ఉన్న అధికారులపై ఎసిబికి వీళ్లే ఒక ఆటోమొబైల్‌ వ్యాపారితో ఫిర్యాదులు చేయిస్తారు. ఫిర్యాదులు వచ్చాయని, మీ ‘రంగు’ బండారమంతా మాకు తెలుసు అని బెదిరించి వసూళ్లు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి కార్యాలయాల్లో కీలక అంశం దొరికితే చాలు ఎసిబి అధికారులకు ‘కనక’వర్షమే. దారిదోపిడీ చేయడంలో కన్నడిగులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎసిబి అధికారులు చేస్తున్న వసూళ్ల దందా అలాంటి ‘కన్నడి’గులనే మరిపిస్తుంది. రిజస్ట్రేషన్‌, రవాణ, చెక్‌పోస్టుల్లో పనిచేస్తూ అవినీతికి పాల్పడే వారిని ఎసిబి అధికారుల వసూళ్ల దందా నుండి ఏ దేవుని కరుణా, కృప తప్పించలేదు. అడిగినంత సమర్పించుకోవడం లేక జైలుకెళ్లడం. వీటిలో జైలుకెళ్లడం కన్నా అడిగినంత ఎసిబి అధికారులకు ఇచ్చి జనం నుండి దానికి రెట్టింపు పిండుకోవడమే అక్కడి అవినీతి అధికారులు నేర్చుకున్న సూత్రం.

రాష్ట్ర రాజధాని నగరమైన గుంటూరు జిల్లాలోనూ ఎసిబి అధికారుల దందా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడా సీనియర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులను సైతం మాయచేయడంలో దిట్ట. అతనే అవినీతి అధికారులకు సమాచారం ఇవ్వడం, తప్పించడం, వసూళ్లు చేయడంలో సూత్రధారిగా ప్రచారం ఉంది.

విశాఖ జిల్లాలో ఎసిబి అధికారుల బాగోతం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధురవాడ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనలో ఎసిబి అధికారుల తీరుపై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చేసిన వ్యాఖ్యలే రాష్ట్రవ్యాప్తంగా ఎసిబి శాఖ ఎంత అవినీతిమయమైందో స్పష్టం చేస్తున్నాయి. రిజస్ట్రేషన్‌ కార్యాలయంలో ముందుగా సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు కాబట్టే ఎసిబి అధికారులు చేసే సర్ప్రైజ్‌ విజిట్‌ గుట్టు రట్టు చేశాయి.

భక్తులకు తిరుపతి శ్రీనివాసుని ప్రసాదం ఎంత మధురమైనదో ఎసిబి అధికారులకు అంతకన్నా మధురమైన ‘ప్రసాద’ము అక్కడ పనిచేసే సీనియర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సేవలేననే గుర్తింపు ఎసిబి శాఖలో ఉంది. జిల్లాలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్లు నెలకు రూ.2లక్షలకుపైగానే ఎసిబి అధికారులకు ముట్టజెబుతారనే విమర్శ ఉంది. జిల్లాలో వీరి వసూళ్లతోపాటు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారుల మామూళ్లతోపాటు వాళ్ల అవసరాలు చూసుకునేందుకు అనుగుణంగా జనం నుండి పిండుతున్నారనే ఆరోపణలు ఆ జిల్లాలో వినిపిస్తుంది. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎసిబి విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌, సిఐ స్థాయి అధికారులు సాధారణ పోలీసు విభాగాల్లో పనిచేసే క్రమంలో నేర్చుకున్న నైపుణ్యాన్ని ఎసిబి శాఖలో ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు ఆ శాఖ ఉన్నతాధికారుల చర్యలు ఏవిధంగా శుద్ది చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.

పోలీస్‌ శాఖలో నిబద్దత కలిగిన అధికారులూ ఉన్నారు. అలాంటి నిబద్దత కలిగిన అధికారులకు కొద్ది మంది చేస్తున్న అవినీతి కార్యక్రమాలు చెడ్డపేరును తెచ్చిపెడుతున్నాయి. ఎసిబి విభాగంలో క్రిందిస్థాయిలో కొందరు అధికారులు చేస్తున్న వసూళ్ల దందాను ప్రక్షాళన చేయకపోతే మొత్తం ఎసిబి విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అవినీతిని ఏ స్థాయిలోనూ సహించేది లేదంటూ మంత్రులు, ఎంఎల్‌ఎలను సైతం కట్టడి చేస్తున్న నేపధ్యంలో అవినీతిని నిరోధించాల్సిన ఎసిబిలో ఇలాంటి అధికారులపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. ఎసిబి ప్రక్షాలనలో పోలీసు, నిఘా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందనేందుకు ఉపముఖ్యమంత్రి పిల్లి సుబాష్‌చంద్రబోస్‌ కామెంట్స్‌ ఆధారం.