– ఎండీ నుంచి వైద్యులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా కారొన పరీక్షలు.
– కరోనా నిబంధనలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తున్నామన్న తాడివలస దేవరాజు
చీరాల : శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి భార్య కాన్పు కోసం ఏలూరు వెళ్లి అక్కడే కరోనా బారిన పడటంతో ఆమెను ఆమె భర్తను వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ సిబ్బందికి కరోనా వైరస్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. దీంతో వైద్యశాల యాజమాన్యం సిబ్బంది స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎండీ దేవరాజు మొదలు వైద్యులు, సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ ప్రారంభం నుండి చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడమే కాకుండా కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతిరోజు నిత్య అన్నదానం చేసినట్లు తెలిపారు. ఆహార ప్యాకెట్లు పంపిణీ తోపాటు కూరగాయలు వంటివి కూడా చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అందజేశామన్నారు. కరోనా నివారణ నిబంధనలు పాటిస్తూ తమ సేవా కార్యక్రమాలు, హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు దేవరాజు తెలిపారు. తమ సిబ్బందిలో ఒకరికి వారి కుటుంబ సభ్యుల ద్వారా వైరస్ వచ్చిన కారణంగా తమ సిబ్బందికి కూడా వైరస్ ఉందనే ప్రచారం నేపథ్యంలో తామందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిపారు.
ఆ ఉద్యోగి భార్య ఏలూరులో కాన్పు అయితే ఆమెను చీరాల తెచ్చేయందుకు వెళ్లి అప్పటి నుంచి వైద్యశాలకు రాలేదన్నారు. వీరికి అక్కడే కరోనా సంక్రమించినట్లు నిర్దారణ అయినప్పటికీ కొందరు కావాలనే తమ వైద్యశాలపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము కోవిడ్ నిబంధనలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనల మేరకు వైద్యశాల మొత్తం కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. కరోనా నియంత్రణకు తాను, తన వైద్య శాల సిబ్బంది ఎల్లపుడు ముందుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు తప్పక పాటిస్తామని చెప్పారు.