Home ప్రకాశం టంగుటూరు ప్రజలు ఆందోళన చెందొద్దు : కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి పివి నారాయణరావు

టంగుటూరు ప్రజలు ఆందోళన చెందొద్దు : కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి పివి నారాయణరావు

379
0

టంగుటూరు : స్థానిక పురం సెంటర్ వద్దగల ఉప ఆరోగ్య కేంద్రం వద్ద రజక పాలెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల చెన్నై వెళ్లి వచ్చిన రజక పాలెంకు చెందిన 75 సంవత్సరాల టంగుటూరి శేషమ్మకు కరోనా పాజిటివ్ రావడంతో రజక పాలెంను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించి ఆ ప్రాంతం మొత్తాన్ని బారికేడ్లతో మూసివేశారు. ఆ ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. రెడ్ జోన్ కు చుట్టుపక్కల సమీప ప్రాంతాలను బఫర్ జోన్ గా ప్రకటించి పోలీసులు నిరంతర నిఘా ఉంచారు.

ఈ సందర్భంగా కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి పివి నారాయణరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన రజక పాలేనికి చెందిన టంగుటూరి శేషమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. త్వరలో కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వస్తుందని, వదంతులు నమ్మవద్దన్నారు. పురం సెంటర్ సమీపంలో నివాసం ఉంటున్న దాదాపు 142మందికి 50విడిఆర్ఎల్ టెస్ట్ లు, 92 ట్రూ నెట్ టెస్టులు చేశామన్నారు. మూడురోజుల క్రితం 10మంది అనుమానితులకు ఒంగోలు రిమ్స్ లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వాటి ఫలితాలు రెండురోజులలో వస్తాయని అన్నారు. రెడ్ జోన్, బఫర్ జోన్ ఏరియాలో ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే నిర్వహించారు. ఆ పరిధిలో దాదాపుగా పదిహేను వందల మందిని గుర్తించామన్నారు. వారేకాక శేషమ్మతో సన్నిహితంగా ఉన్నవారు, అనుమానం ఉన్నవారు ఎవరైనా పిల్లలు, పెద్దలు తప్పక కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ 60సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు బయట చేయించు కోవాలంటే ఎక్కువ ఖరీదు అవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరు ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి చొప్పర కృష్ణ, తహశీల్దార్ చనుమాల ఉష, అడిషనల్ జిల్లా వైద్యాధికారిని మీనాక్షి మహదేవన్ కరోనా బాధిత ప్రాంతాలను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి జగదీష్, ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీరీలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.