Home ప్రకాశం టంగుటూరు దళితవాడల్లో కరోనా విలయ తాండవం

టంగుటూరు దళితవాడల్లో కరోనా విలయ తాండవం

643
0

ప్రకాశం : జిల్లా కేంద్రమైన ఒంగోలుకి కూతవేటు దూరంలో ఉన్న టంగుటూరులో కరోనా విలయతాండవం చేస్తుంది. నివారణ చర్యలు తీసుకునే నాథుడే కనబడటంలేదు. అంబేద్కర్ నగర్, అరుంధతీ నగర్ లలో గడిచిన నెల రోజులలోనే సుమారు 20మంది వరకు చనిపోయారు. ఒక్క అంబేద్కర్ నగర్ లోనే 14 మంది చనిపోయారు. వీళ్ళు అందరూ నిరుపేదలే. హాస్పిటల్ లో వీరికి బెడ్లు దొరకవు. అక్కడ పెద్దోళ్ల సిఫార్సు ఉంటేనే బెడ్లు దొరుకుతున్నాయి.

మరొక బహిరంగ నిజం ఏమంటే ఇప్పటికీ ఏ దళిత వాడకు కోవిడ్ వ్యాక్సిన్ అడుగుపెట్టలేదు. అందరూ అనారోగ్యంతోనే చనిపోయినట్లు చెబుతున్నప్పటికీ వీరిలో ఎక్కువ మంది కరోనాతో చనిపోయినట్లు గ్రామంలో భయాందోళన నెలకొంది. ఎందుకు చనిపోతున్నారో తెలియదు. కరోనాతోనా లేక మరి ఇంకేమైనా అనారోగ్య కారణమా అనేది తెలియదు. ఏదిఏమైనా ఒక్కనెలరోజులలోనే ఈ రెండు దళిత కాలనీలలో 20మంది చనిపోయారు.

టంగుటూరు అంబేద్కర్ నగర్, అరుంధతీ నగర్ ల స్మశానాలు కలిసే ఉంటాయి. ఈ స్మశానంలో శవాలకు గుంతలు తీసే సాయి ఈ నెలలో షుమారు 20 శవాలకు గుంతలు త్రొవ్వినట్లు చెప్పాడు. ఒక్కడినే ఇన్ని గుంతలు త్రొవ్వాలంటే భారంగా, ఆవేదనగా ఉందన్నారు. చనిపోయిన వారంతా అనారోగ్యంతోనే చనిపోయినవారేనని, అయితే వీరిలో ఎక్కువ మంది కరోనాతో చనిపోయినవారేనని చెబుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హాస్పిటల్ లో చనిపోయిన వారిని కొందరు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చి, శ్మశానానికి తీసుకెళుతున్నారు. కొందరు హాస్పిటల్ నుండి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తున్నారు. వెంటనే దినకర్మలు చేస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి ఇంటికి భోజనాలకు తక్కువమంది బంధువులు హాజరవుతున్నారు, కరోనా కాకపోతే ఎక్కువ మంది హాజరవుతున్నారు. భోజనాలు తినేటప్పుడు బందువులే కదా అని పక్కనున్నవారితో మాట్లాడుతున్నారు. ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియదు. మాట్లాడకపోతే బాగుండదని మాట్లాడడం కరోనా కొని తెచ్చుకోవడం. ఒక దినకర్మకి వెళ్లి భోజనాలు చేసి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని గుసగుసలు చెప్పుకుంటున్నారు.

కానీ ఈ దళిత కాలనీలలో ఇంతమంది చనిపోతున్నా ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ, ఏ అధికారి కానీ తొంగిచూడలేదు. అసలు ఎందుకు చనిపోతున్నారు. ఎంతమంది చనిపోయారు. ఈ దళిత కాలనీలలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నున్నాయనే విచారనే లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలనే ఆలోచగాని, ఇక్కడి ప్రజలకు ధైర్యం చెప్పేవాళ్ళు, చైతన్యం చేసేవాళ్ళు కనుచూపుమేర కనిపించడంలేదు.

ఎన్నికలప్పుడు మాత్రం ప్రేమ ఒలకబోస్తూ ఏవేవో మాటలు చెప్పిన నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో భరోసాగా నిలిచేవాడు లేరు. రాజకీయ నాయకులు సరే వాలేంటరీలు, సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే అధికారులకు ఈ దళిత కాలనీలో జరుగుతున్న వరుస మరణాలు ఒక్క అధికారికి కూడా కనిపించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పల్లెల వైపు చూడకపోవడం దారుణమైన విషయమని దళిత కాలనీ వాసులు రాజకీయనేతలు, అధికారులపై ఆగ్రహావేశాలు వెళ్లబుచ్చుతున్నారు.