కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు.
ఈ సి. సి. సి. మనకోసం సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరియు దర్శకుడు, దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్, ఈ విధంగా తెలియజేశారు. మొదటగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న కలకలం మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికులు చాలా మంది చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా సహాయం చేయడంలో సినిమా ఇండస్ర్ట్రీ ముందుంటుంది. ఇప్పుడు కూడా సోదర నటీనటులు విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవిగారు తన ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవిగారి ఆధర్యంలో సురేష్ బాబు గారు, నేను, ఎన్.శంకర్ గారు, కల్యాణ్ గారు, దాము గారు అందరం కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయ్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.. దీనికి నాందిగా మొదట చిరంజీవి గారు కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున గారు కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25లక్షలు ఇలా విరాళాలు ప్రకటించారు. వీరే కాకుండా ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు.. కరోనా మహమ్మారి వల్ల పలు సమస్యలకు లోనవుతున్న సినీ కార్మికుల సంక్షేమమే ఈ సంస్థ ముఖ్య ఆశయం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.. అందరం కలిస్తేనే కరోనాను, అది తెచ్చిన ఇబ్బందులను పారద్రోలగలం.. అన్నారు.
అనంతరం ప్రముఖ డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వేలాది మంది కార్మికులకు అండగా నిలబడాలనే సంకల్పంతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సి. సి. సి. (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి ఛైర్మన్‌గా మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు. అలాగే సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజగారు, సురేష్ బాబు గారు, సి.కల్యాణ్ గారు, దాము గారు, బెనర్జీ గారు, నేను సభ్యులుగా ఉంటాము. సి. సి. సి. మనకోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, గీతా ఆర్ట్స్ బాబు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, కొమరం వెంకటేష్ గారు, ఫెడరేషన్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజలందరూ కూడా స్వయంగా ఇంట్లోనే కరోనా వైరస్ తో సైనికుల్లా పోరాడుతున్న సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతమైన పోరాటం జరుగుతోంది ఈ కరోనా వైరస్ మీద. కరోనా ను అంతమొందించే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. మీ ఇళ్ళలోనే ఉంటూ కనబడని శత్రువుతో పోరాడండి. విజయం సాధిద్దాం.. సాధిస్తాం.. ఈ సేవా కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, మన పురపాలక ఐటీ శాఖామంత్రి కేటీఆర్ గారి అండదండలు, అధికారుల, పోలీస్ శాఖ వారి సహాయసహకారాలు కావాలని కోరుతున్నాం.. అన్నారు.