– ఫలించిన ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు కృషి
– నలుగురు అధికారులతో విక్రయాలపై పర్యవేక్షణ
పర్చూరు : నల్ల బర్లీ పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. పొగాకు కొనుగోలుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి అగ్రికల్చర్ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. బర్లీ టొబాకో కొనుగోలుపై పర్యవేక్షణ, విక్రయాల తీరు తెన్నులు కంట్రోల్ రూం పనిచేయనుంది. బర్లీ పొగాకు రైతుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి ఎంఎల్‌ఎ తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వం గత నెల 29న ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు రైతులు, రైతు సంఘాలు, పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
దీనిలో పొగాకు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులతో మోనిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. గుంటూరు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రమేష్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి జ్యోతి, టొబాకో ఫీల్డ్ ఆఫీసర్ ఎ వంశీకృష్ణ, ఇండియన్ టొబాకో అసోసియేషన్ మెంబర్ ఎన్ శ్రీనివాసరావులతో ప్రత్యేక నియంత్రణ విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పొగాకు రోజువారీ విక్రయాలను పర్యవేక్షించేందుకు గుంటూరు పొగాకు బోర్డులో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బర్లీ, బ్లాక్ టొబాకో కొనుగోలు చేసిన వివిధ పొగాకు కంపెనీల నుండి అధికారుల కమిటీ ప్రతిరోజూ సమాచారాన్ని సేకరించి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు నివేదిక అందజేయనున్నారు. రైతు బిడ్డగా రైతు సమస్యలు తెలిసిన ఎమ్మెల్యే ఏలూరి చూపిన చొరవ, కృషి పట్ల రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.