Home ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు.. నెక్ట్స్ అయినా గెలుస్తారా?

ఏపీ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు.. నెక్ట్స్ అయినా గెలుస్తారా?

318
0

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని
మారుస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ నుంచి రఘువీరారెడ్డిని తప్పించింది. ఇదే ప్లేస్‌లోకి మరో సీనియర్ నేత శైలజానాథ్‌ను నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుదిచి పెట్టుకుపోయింది. వరుసగా రెండు సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 2024కు అయినా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక పదవుల్లో మార్పులు చేసింది.

అయితే ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా అంటే కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నియామకమైన శైలాజానాథ్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో అనంతపురం జిల్లా
శింగనమల నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఊహించని విధంగా ఘోరంగా ఓడిపోయారు. ఎంతగా అంటే నోటా కంటే తక్కువ ఓట్లు
వచ్చాయి. మొత్తం 1,97,466 ఓట్లు పోల్ అవగా అందులో ఆయన 1,384 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఇక్కడ నోటాకు 2,304
ఓట్లు పడ్డాయి. అంటే నోటాకు వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే శైలాజానాథ్‌కు చాలా తక్కువ ఓట్లు రావడం అప్పట్లో రాజకీయ వర్గాలు ముక్కున వేలు వేసుకున్నారు.

ఇప్పుడు అదే శైలజానాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పని చేయాల్సి వస్తుంది. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బలపడాల్సిన అవసరం ఉంది. అదీ వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనను తట్టుకొని నిలబడాలి. ఎవరు అవునన్నా, కాదన్నా రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలమైన పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీ చాలా బలహీనంగా అయిపోయింది. రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చట్టం చేయలేదు. ఈ పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో బలపడాలంటే ప్రజా సమస్యలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కంటే తీవ్ర ప్రయత్నాలు చేయాలి. మరి శైలజానాథ్ ఆధ్వర్యంలోనైనా ఏపీ ప్రజల్ని సంతృప్తి పరిచి.. కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారేమో చూడాలి.