Home ఆంధ్రప్రదేశ్ వైసీపీలో పెరుగుతున్న పోటీ – పావులు కదుపుతున్న గుంటుపల్లి

వైసీపీలో పెరుగుతున్న పోటీ – పావులు కదుపుతున్న గుంటుపల్లి

505
0

హైదరాబాద్ :  ప్రకాశం జిల్లా చీరాల వైసిపి సీటుకు పోటీ పెరుగుతుంది. రానున్న ఎన్నికల్లో గెలిచేవారికే సీటు ఇస్తారని, పీకే టీమ్ సర్వే ఫలితమే సీట్ల ఎంపికలో కీలకం కానుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చీరాల వైఎసార్ అభ్యర్థి యడం బాలాజీనే అని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అయితే జగన్ సీఎం కావాలంటే గెలిచే అభ్యర్థులే కీలకం. దీంతో చీరాల సీటు బిసిలకు కేటాయిస్తారనే వాదన బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో బిసి నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

వైద్యునిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మనిషిగా పెరు తెచ్చుకున్న డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు వైఎసార్ సీటు కోసం పావులు కదుపుతున్నారు. పీకే టీమ్ సర్వేలోను గుంటుపల్లి పెరు పరిశీలనకు రావడంతో ప్రయత్నాలు వేగం పెంచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఈ పాటికే ప్రచారం జరిగింది. వైద్యునిగా సేవాకార్యక్రమాలతోపాటు సామాజిక ఉద్యమాల పట్ల మంచి అవగాహనతో బిసి, ఇతర సామాజిక ఉద్యమాలను ప్రోత్సహించారు. తాజాగా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచార నేపధ్యంలో వైసిపి రాష్ట్ర నేత, ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

నాకు కాకుంటే… నేను చెప్పిన వారికే…

వైఎసారిసిపిలో గ్రూప్ రాజకీయాలు నివురు కప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు ఒకే వేదికపై కూర్చుంటున్న నేతలు వేదిక దిగిన తర్వాత ఎవరి పని వారు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు బాలాజీకే నని ప్రకటించినప్పటికీ సర్వేలో బిసిలకు ఇవ్వాల్సి వస్తే తమ పేరే ప్రతిపాదిస్తారన్న హామీతోనే వైసీపీలో చేరినట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూరగాని లక్ష్మీ దంపతులు చెప్పుకుంటున్నారు. అదే ఆశతో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గునుకుల రామమూర్తినాయుడు వంటి మరికొందరు బిసి నేతలు ఇటీవల వైసీపీలో బాలాజీ నాయకత్వంలో జగన్ సమక్షంలో చేరారు.

గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన డాక్టర్ వరికూటి అమృతపాణి పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది. తనతోపాటు తన సోదరుడైన కొండెపి ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబుకు ఎవరికో ఒకరికి అవకాశమని చెప్పడంతో తమ్మునికోసం తాను పోటీ నుండి విరమించుకున్నారు.  అయితే కొండెపి రాజకీయ వివాదంలో తమ్మునికీ అన్యాయంచేస్తున్నారానే ఆవేదన ఇద్దరు సోదరుల్లో ఉంది. అదే క్రమంలో చీరాల నుండి గెలిచే అభ్యర్థిని ప్రతిపాధించాలనే సూచన పార్టీ అధినేత జగన్ నుండే ఉందని అమృతపాణి చెబుతున్నారు. అలా అమృతపాణి సహకారంతో బిసిలైతే తామున్నామని డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావుతోపాటు జగన్ సెక్యూరిటీ ఆఫీసర్ సోదరుడైన చేనేత యువనాయకుడు బీరక సురేంద్ర, చేనేత అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య ఆశలు పెట్టుకున్నారు.

గత కొంతకాలంగా నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్న యడం బాలాజీ, డాక్టర్ వరికూటి అమృతపాణి సీట్ల ఎంపిక ప్రతిపాదనల్లోనూ తమకు కాకుంటే తాము చూపిన వారికేనంటూ జరుగుతున్న ప్రచారం రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే…!