Home ఆంధ్రప్రదేశ్ ఆమె ఒకప్పుడు టీచర్… మరి ఇప్పుడు…?

ఆమె ఒకప్పుడు టీచర్… మరి ఇప్పుడు…?

656
0

అమరావతి : ఇరాక్‌లో అంతరించి పోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందిందా? అవునంటే సహజంగానే కమ్యూనిస్టులకు వుత్సాహం కలిగించే అంశమైతే, వ్యతిరేకులకు దడపుట్టించే పరిణామమే. అన్నింటికీ మించి అసలు కమ్యూనిస్టులేమిటి ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో జతకట్టటం ఏమిటి, అధికారంలో కూడా పాలుపంచుకొనేందుకు సిద్దపడటం ఏమిటి అని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతేనా, తాజా ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున అదీ ఒక మహిళ, షియా ముస్లింల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడే నజఫ్‌ పట్టణ నియోజకవర్గం నుంచి విజయం సాధించటమేమిటి? ముస్లిం ఛాందసులు కమ్యూనిజం మీద వ్యతిరేకత వదులుకున్నారా అని ఆశ్చర్యంతో తలమునకలు అవుతున్నవారు కూడా లేకపోలేదు. ఇంతకీ అసలక్కడేం జరిగింది. దాని గురించి పరిశీలకులేమంటున్నారు?

ఇరాక్‌ మరోసారి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. గత నెల పన్నెండున అక్కడ జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో అల్‌ సదర్‌-కమ్యూనిస్టు పార్టీ కూటమి ‘సంస్కరణల కోసం పదండి ముందుకు‘ అనే నినాదంతో అనూహ్యంగా పెద్ద కూటమిగా ఎన్నికైంది. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. సంక్లిష్టమైన తీర్పు రావటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అనుమతించిన మూడునెలల వ్యవధిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి రావటం ఇష్టం లేని శక్తుల ప్రోద్బలంతో పార్టీ కార్యాలయం మీద బాంబు దాడి జరిగింది. ఎన్నికలకు ముందు ఇరాన్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త అయిన అలీ అక్బర్‌ వెలాయతీ ఇరాక్‌ సందర్శనకు వచ్చి వుదారవాదులు, కమ్యూనిస్టులను ఇరాక్‌ పాలనకు తాము అనుమతించేది లేదని చేసిన ప్రకటన ఇరాన్‌ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి ప్రతిబింబం. అమెరికా సరేసరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పెంపుడు చిలక. ‘పదండి ముందుకు’ పేరుతో ఎక్కువ స్ధానాలు సాధించిన కూటమి గురించి ఆ ఏముంది అవసాన దశలో వున్న కమ్యూనిస్టులు, సున్నీ వ్యాపారులు, ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడిన కూటమి అంటూ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఆ కూటమిలో ఆల్‌ సదర్‌ పార్టీతో పాటు, కమ్యూనిస్టుపార్టీ, మార్పుకోసం యువజనోద్యమ పార్టీ, పురోగామి, సంస్కరణల పార్టీ, ఇరాకీ రిపబ్లికన్‌ గ్రూప్‌, జస్టిస్‌ పార్టీ వంటివి వున్నాయి. జనంలో పెరిగిన అసంతృప్తికి ప్రతిరూపంగా ఇరాక్‌లో జరుగుతున్న సమీకరణలని చెప్పవచ్చు. ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. దేశవ్యాప్తంగా 44శాతం మంది పాల్గొంటే బాగ్దాద్‌లో 33శాతమే పాల్గొన్నారు. ఈ నగరంలో సాదరిస్టు కూటమి 23శాతం ఓట్లు తెచ్చుకుంది. మిగతా పార్టీలలో దేనీకీ పదిశాతానికి మించి రాలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజుల తరువాత కొన్నివేల పోలింగ్‌ కేంద్రాలలో అక్రమాలు జరిగాయని అక్కడి ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన అక్కడేం జరుగుతుందో ఫలితాన్ని ఎటువైపుగా తిప్పుతారో తెలియదు.

ఇరాన్‌ – ఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాల దాడి, దురాక్రమణ తరువాత సద్దామ్‌ హుస్సేన్‌ హత్య అనంతరం ప్రపంచ వార్తల్లో ఇరాక్‌ వాటా బాగా తగ్గిపోయింది. అలాంటిది తాజా ఎన్నికలతో పశ్చిమ ఆసియా, పాశ్చాత్య దేశాల మీడియాలో ఈ ఎన్నికలు ఒక కుదుపు మాదిరి ఇరాక్‌ పరిణామాలు ముందుకు వచ్చాయి. ఇవి టీకప్పులో తుపానులా సమసిపోతాయా లేక సరికొత్త పరిణామాలకు నాంది అవుతాయా అన్నది చూడాల్సి వుంది.

మక్తాడా ఆల్‌ సదర్‌

ఎన్నికలలో గెలిచిందెవరన్నది సాధారణ వార్త, అయితే ‘ఇరాక్‌ ఎన్నికలలో ఓడిందెవరు? ఇరాన్‌, అమెరికా’ అనే శీర్షికతో ఒక వ్యాఖ్యానం వెలువడింది. ఇది అసాధారణం. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా వున్న ఒక మతాధికారి ఇరాక్‌ను స్వాతంత్య్రం వైపుగా నడిపించాలని కోరుకుంటున్నారు అని సారాంశాన్ని రాశారు. సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తరువాత ఇరాక్‌ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు 2003 నుంచి అమెరికాతో పాటు ఇరాన్‌కూడా చేయాల్సిందంతా చేసింది. ఆ రెండింటి మద్దతుదార్లను పక్కన పెట్టిన ఇరాకీ ఓటర్లు తమ అస్ధిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలనే ధోరణి వైపు మొగ్గుతున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాక్‌ పార్లమెంట్‌లో 329 స్ధానాలున్నాయి. వాటిలో షియా మతనాయకుడు మక్తాడా ఆల్‌ సదర్‌, కమ్యూనిస్టులతో కూడిన నాయకత్వంలోని రాజకీయ సంఘటన 54 స్ధానాలతో మొదటి స్ధానంలో వుంది. వీరిలో కమ్యూనిస్టులు ముగ్గురే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన వుదంతంగా మారింది. ఇరాన్‌ అనుకూల షియా పార్టీల కూటమికి 47, అమెరికా అనుకూల ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ నాయకత్వంలోని కూటమికి 42 స్ధానాలు వచ్చాయి. మిగిలినవి అనేక చిన్న పార్టీలు, ప్రాంతీయ, మత, గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే వారికి దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 165 మంది మద్దతు కావాల్సి వుంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ను రద్దు చేసి కొన్ని ఫలితాలను తారు మారు చేస్తారా? చేసినప్పటికీ బలాబలాల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. సదర్‌ కూటమి లేకుండా ఇరాన్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినా, సదర్‌ ప్రమేయంతో అమెరికా వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పడినా అమెరికాతో లడాయి తప్పుదు. రెండవది జరిగితే అది ఇరాన్‌ ప్రభావం, ప్రమేయాన్ని కూడా అంగీకరించే అవకాశం వుండదు. పశ్చిమాసియాలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావం కలిగించే అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో సంబంధాలు బెడిసిన పూర్వరంగంలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అమెరికా చూస్తూ వూరుకుంటుందా? పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికాతో జతకట్టిన సౌదీ అరేబియాలో ఆ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అది సదర్‌ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని సుస్ధిరత అన్నది ప్రశ్నార్ధకమే.

ఇరాక్‌, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? షియా తెగకు చెందిన మక్తాదర్‌ అల్‌ సదర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఇరాకీ జాతీయవాద వుద్యమం సున్నీ తెగవారిపై అమెరికా సైన్యం జరిపిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు కూడా జరిపింది. షియాల్లోని మితవాదులు, పేదలు కూడా ఇది ఇరాన్‌ అనుకూల వైఖరిగా పరిగణించారు. ఇప్పటివైఖరిని చూస్తే అమెరికా వ్యతిరేకత, ఇరాన్‌ వైఖరిని కూడా వ్యతిరేకించే ఒక జాతీయ రాజకీయ వుద్యమంగా అది మారింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సున్నీ అరబ్బులు కూడా నేడు గణనీయంగా సదర్‌కు మద్దతు ఇస్తున్నారని తాజా ఎన్నికలు వెల్లడించాయి. ఇరాక్‌ ప్రయోజనాలకే పెద్ద పీట, అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకం అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌ పీడ వదిలింది, ఇరాక్‌ స్వేచ్చ పొందింది అని కూటమి మద్దతుదార్లు బాగ్దాద్‌ వీధుల్లో నినాదాలు చేశారు.

మత ప్రమేయం కలిగిన సదరిస్టులు, మతాన్ని అంగీకరించని కమ్యూనిస్టులు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నలకు పరిశీలకులు చెబుతున్నదేమిటి? ముందు దేశంపై ఇరాన్‌ ప్రభావాన్ని అంతం చేయాలి అన్నది ఒకటి. దేశంలో అది ఇరాన్‌ లేదా అమెరికా అనుకూల ప్రభుత్వమైనా అవినీతిని పెంచి పోషించటంలో ఎలాంటి తేడా లేదు, అందువలన అవినీతి నిర్మూలనకు, అభివృద్ధికోసం పనిచేసేందుకన్నది మరొక కారణంగా చెబుతున్నారు. సదరిస్టులు షియా మతభావాలతో ప్రారంభమైనప్పటికీ షియా-సున్నీ తెగలలోని కార్మికులు, పేదలను ఐక్యం చేయటంలో జయప్రదమయ్యారని, పేదల వాణిగా మారారన్నది కొందరి అభిప్రాయం. కమ్యూనిస్టులు చేతులు కలపటానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచమంతటా కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న ప్రచారం బలంగా జరుగుతున్న కాలంలో, ముస్లింలు- కమ్యూనిజానికి చుక్కెదురు అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరొకవైపు జరుగుతున్న పూర్వరంగంలో ఇరాక్‌, ఇతర అరబ్బు దేశాలలో కమ్యూనిజానికి జనం ఆకర్షితులౌతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఛాతమ్‌ హౌస్‌ అనే ఒక సంస్ధలో పని చేస్తున్న డాక్టర్‌ నసైబా యూనిస్‌ ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.’ సద్దామ్‌ హుస్సేన్‌ (2003) అనంతర కాల రాజకీయాలను తిరస్కరించే వారికి ఒక వాహనంగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ తయారైంది. ప్రభుత్వాల అవినీతి, పేదల సంక్షేమాన్ని విస్మరణ కారణంగా అలసిపోయిన ఇరాకీలను ఒక విశాల సామాజిక న్యాయ అజెండాతో ఆకర్షించి మద్దతును కూడగట్టుకున్నది. కష్టజీవులకు సేవ చేయాలనే ఒక వుమ్మడి సైద్ధాంతికపరమైన కేంద్రీకరణ, యధాతధ స్ధితిని మార్చాలనే ఒక వుమ్మడి అభిప్రాయం సాదరిస్టులు, కమ్యూనిస్టులకు వుంది. ఇదే సమయంలో నాయకత్వ స్ధాయిలలో వుదారవాదులైన సాదరిస్టులు వున్నప్పటికీ మత విలువలను రుద్దకుండా స్వేచ్చ, స్వాతంత్య్రాలకు సాదరిస్టులు ఎంత మేరకు కట్టుబడి వుంటారు? ప్రత్యేకించి ఈ కూటమిలో కమ్యూనిస్టులు ఒక చిన్న భాగస్వామిగా గట్టిగా వున్నపుడు అన్న ఒక ఆతృత కూడా ఇరాకీ వామపక్ష శక్తులలో గణనీయంగా వుంది. మహిళల హక్కుల వంటి విషయాలలో పక్షపాతం లేని వైఖరిని, మద్దతును సాదరిస్టులు విస్తరించకపోవచ్చు ‘ అని నసీబా చెప్పారు.

జోయల్‌ వింగ్‌ అనే మరొక విశ్లేషకుడు ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ గురించి ఇలా చెప్పారు.’ ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. సాంప్రదాయక మార్క్సిజం-లెనినిజాన్ని అనుసరిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నపుడు దానికి అనుకూలంగా వుండేది. గతంలో మధ్యప్రాచ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో ప్రత్యేకించి అరబ్‌ ప్రాంతంలో విస్తరించిన పార్టీలైన నాజరైట్స్‌, బాతిస్టుల వంటివాటితో పోటీపడేవి. 1958 వరకు కమ్యూనిస్టులను రాజరికం నిరంతరం హింసించినప్పటికీ దేశంలోని కార్మికవర్గం, విద్యార్ధులలో కమ్యూనిస్టులు పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి సైద్ధాంతిక మద్దతుదారులు వుండేవారు, వారిలో ప్రధానంగా జనరల్‌ అబ్దల్‌ కరీమ్‌ ఖాశిం తిరుగుబాటుద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత 1968లో బాత్‌పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఖాశిం ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆయనను హత్య చేశారు. కమ్యూనిస్టుపార్టీని దాదాపు నాశనం చేశారు. తరువాత వారు ఎక్కువ భాగం రహస్యంగా పని చేశారు. 2003 తరువాతనే పార్టీ చాలా పరిమితంగా పనిచేస్తూ బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. అయితే అది చాలా చిన్నది. వంతుల వారీ రాజకీయ అధికార పద్దతి, తెగలవారీ దామాషా పద్దతిలో పదవుల పంపిణీ విధానం, అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజ బృందాలు ఆందోళనకు వుపక్రమించినపుడు కమ్యూనిస్టు పార్టీ వారితో కలసి గత ఐదు సంవత్సరాలలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక నిరసనల ద్వారా సాదరిస్టులతో కమ్యూనిస్టుపార్టీ జతకట్టింది. అదే మే నెలలో సాదరిస్టు కూటమిలో భాగంగా పోటీ చేసేందుకు దారి తీసింది. రక్షణ కల్పిస్తామని సాదరిస్టులు చెప్పటం, ఇరాకీ రాజకీయ ప్రముఖులలో చేరేందుకు ఒక దారిగా కమ్యూనిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ కమ్యూనిస్టు శ్రేణులలో ఒక అనిశ్చితి వుంది. తమకు నచ్చని విధానాలను సాదరిస్టులు రుద్దుతారా అని అనేక మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారు. సాదరిస్టు పార్టీ అధికారంలో చేరటాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవటం లేదు, ఒకవేళ అదే జరిగితే ఆ కూటమి నుంచి బయటపడాలని కొంత మంది ఆలోచిస్తున్నారు.’ అని జోయెల్‌ వింగ్‌ పేర్కొన్నారు.

‘ గత పదిహేను సంవత్సరాలుగా నడచిన ప్రభుత్వ వ్యవస్ధను తిరస్కరించటంలో, సంస్కరణ, అవినీతి, వంతుల వారీ అధికార స్వీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రతిధ్వనించారు. అయితే ఇవి వైఖరులు తప్ప విధానాలు కాదు. వాస్తవ సంస్కరణల అజెండాలో అవెలా వాస్తవ రూపం దాల్చుతాయో తెలియదనుకోండి’ అని సింగపూర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫనర్‌ హదాద్‌ పేర్కొన్నారు. వంతుల వారీ పద్దతిలో అధికారాన్ని పంచుకోవటం కంటే ప్రతిపక్షంలోనే వుండటం మేలని ఎన్నికల ఫలితాల అనంతరం సాదర్‌ కూటమిలోని కొన్ని పార్టీల నేతలు పేర్కొన్నారు. టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికోసం బాగ్దాద్‌ శివార్లలో విప్లవ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆవాసం తరువాత కాలంలో సాదర్‌ నగరంగా మారింది. దాని జనాభా ప్రస్తుతం 35లక్షలు. బాగ్దాద్‌లో సగం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1999లో షియా మతనాయకుడు అయాతుల్లా మహమ్మద్‌ సాదిక్‌ అల్‌ సదర్‌ను హత్య చేసిన తరువాత ఆ నగరం సాదర్‌ సిటీగాను, ప్రస్తుతం సాదర్‌ పార్టీ కేంద్రంగా మారింది. ఆయన కుమారుడే ప్రస్తుతం సాదరిస్టు పార్టీ నేత మక్తాదా అల్‌ సదర్‌. సాదర్‌ పార్టీ నాయకత్వంలోని సాయుధ విభాగం అమెరికా సైన్యాన్ని ఎదిరించటంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని పోరాడిన చరిత్ర వుంది.

2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా అధికారుల కనుసన్నలలో నడిచిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు. వివిధ సేవలను అందించటానికి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలలో మునిగిపోయారు. 2010 వేసవిలో తీవ్ర ఎండలు, విద్యుత్‌ కోత కారణంగా జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దాంతో జనం నిరసనలకు దిగారు. 2011 వసంత గర్జన పేరుతో మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన నిరసనలు ఇరాక్‌ను కూడా తాకాయి. ఇరాకీ వసంత గర్జన పేరుతో వుద్యోగాలు, విద్యుత్‌ తదితర డిమాండ్లపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వం అణచివేతకు దిగటంతో 45 మంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం దేశమంతటా అనేక సమస్యలపై ప్రదర్శనలు జరగటం పరిపాటి అయింది. 2015 నుంచి మరింత సంఘటితంగా జరిగాయి. ఈ క్రమంలోనే సాదరిస్టులు, కమ్యూనిస్టులు దగ్గరయ్యారు. మత, తెగల ప్రాతిపదికన ప్రభుత్వంలో పదవుల పందేరాన్ని ఈ ప్రదర్శనల్లో నిరసించారు. ఇరాక్‌ పార్లమెంట్‌, ఇస్లామిక్‌ మత రాజ్యం ఒకే నాణెపు బమ్మా బరుసు వంటివని యువత బ్యానర్లు ప్రదర్శించేవారు.

సద్దామ్‌ హుస్సేన్‌ అమెరికాను వ్యతిరేకించి దాని కుట్రకు బలైన యోధుడిగా లోకం ముందు కనిపించేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కరడు గట్టిన కమ్యూనిస్టు, కార్మిక వ్యతిరేకత వుంది. అమెరికా సిఐఏతో చేతులు కలిపిన ఇరాక్‌ బాతిస్టు పార్టీనేతలు కమ్యూనిస్టు అనుకూల జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను హతమార్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుట్రలో సద్దామ్‌ హుస్సేన్‌ ఒక ప్రముఖుడు. బాతిస్టు పార్టీ, సద్దామ్‌ హయాంలో కమ్యూనిస్టులను అణచివేశారు. కార్మిక సంఘాల ఏర్పాటును కూడా నిషేధించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌ను తయారు చేయటంలో అమెరికా పాత్ర అందరికీ తెలిసిందే. ఆ రెండు దేశాలూ యుద్ధానికి తలపడిన సమయంలో అమెరికా సద్దామ్‌ హుసేన్‌కు మద్దతు ఇచ్చింది. ఆయుధాలు కూడా అందచేసింది. తరువాత సద్దాం వ్యతిరేకిగా మారటంతో అదే అమెరికా చివరకు ఇరాక్‌ను ఆక్రమించి హతం చేసింది. సద్దాం మరణం తరువాతే విదేశాలలో, స్వదేశంలో వున్న ఇరాకీ కమ్యూనిస్టులు బహిరంగ కార్యకలాపాలలోకి వచ్చారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. అమెరికా వ్యతిరేకిగా మారిన సద్దామ్‌ హుస్సేన్‌ను బయటి ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులు గతంలో బలపరిచారు. ఇరాక్‌ దురాక్రమణను, సద్దాం వురిని కూడా నిరసించారు. సద్దామ్‌ అణచివేతకు గురైన ఇరాకీ కమ్యూనిస్టులు ఈ వైఖరిని ఆమోదించరనేది స్పష్టం. అలాగే ఇప్పుడు మన దేశంలో వున్న మతోన్మాదశక్తులు, అవి చెలరేగిపోతున్న పూర్వరంగంలో వాటికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులకు ఇరాకీ కమ్యూనిస్టుల వైఖరి మింగుడుపడకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో ఎలా కలుస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంలోని మతోన్మాదులు కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారు. కేరళ వంటి చోట్ల హతమార్చేందుకు వెనుకాడటం లేదు. ఇరాష్‌ షియా మతనాయకుడి ఆధ్వర్యంలోని పార్టీ సున్నీ తెగ ముస్లింల మద్దతు కూడా కూడగట్టుకున్నది. కమ్యూనిస్టుల విషయం తెలిసి కూడా అనేక పోరాటాలలో వారితో భుజం కలిపింది. అయితే అది శాశ్వతంగా అలాగే వుంటుందా? అధికారం వచ్చేంత వరకు కమ్యూనిస్టులను వుపయోగించుకొని తరువాత వ్యతిరేకిగా మారితే ఏమిటి అన్న సందేహాలు తలెత్తటం సహజం. తాము స్వయంగా అనేక ప్రపంచ అనుభవాలు చూసిన తరువాత ఇరాకీ కమ్యూనిస్టులు అంత గుడ్డిగా లేదా భ్రమలతో ఒక మత నేత సారధ్యంలోని పార్టీతో చేతులు కలుపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. పదండి ముందుకు పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేదా కమ్యూనిస్టులు చెప్పే సోషలిజం వంటి అంశాలేమీ లేవు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, ఇరాన్‌, అమెరికా జోక్యానికి వ్యతిరేకమైన ఒక జాతీయవాద అజెండాతో వారు జనం ముందుకు వెళ్లారు. అనూహ్యంగా ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ఎన్నికల ప్రణాళికు భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించినా మిగతా పార్టీలు వ్యతిరేకించి బయటకు వస్తాయి. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు.