Home బాపట్ల నిజాంపట్నంలో కలెక్టర్ విస్తృత పర్యటన

నిజాంపట్నంలో కలెక్టర్ విస్తృత పర్యటన

9
0

నిజాంపట్నం (Nijampatnam) : దిత్వా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుభూములు నీట మునగ కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లను వివరంగా ఎఒ చుక్క విజయ రాజును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఒడ్లు పట్టుకునే గోనె సంచులు అందించారు. రైతులు వడ్లు నిలువ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన గోడౌన్ పరిశీలించారు.

తుపాను షెల్టర్లు, సచివాలయాలు, పునరావాస కేంద్రాల నిర్వహణకు తగిన సౌకర్యాలు లేవని గుర్తించిన కలెక్టర్, ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ పంపిణీ చేశారు. సచివాలయం ప్రాంగణంలో మహిళల కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని చేతి అల్లికలు నేర్చుకుంటున్న వాటిని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా వీటిని తయారు చేస్తారు, మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట కాల్వలు, మురుగు కాల్వలు, పంట కాల్వల్లోని అవరోధాలు తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సిద్ధంగా ఉంచిన జెసిబి యంత్రాలు, గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన రక్షణ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చిలైట్లు, రోపుల సామగ్రిని, రేపల్లె ప్రధాన కాల్వ వద్ద చెడిపోయిన లాక్‌లను పరిశీలించారు. సముద్ర జలాలు కాల్వలోకి రాకుండా గేట్లు కీలకమని అధికారులు వివరించారు. గత తుపానులో లాక్‌లు పనిచేయక పోవడంతో వందల ఎకరాల పంట నీట మునిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కాల్వల్లో నీరు నిల్వ లేకుండా మార్గం సుగుమం చేయాలని సూచించారు. తదుపరి భారతీయ తీర రక్షణ దళం కార్యాలయాన్ని సందర్శించారు. కమాండెంట్ రాజేంద్ర స్వరూప్‌తో తీర ప్రాంత సంరక్షణ, సాంకేతిక పరికరాలు, యంత్రాల వినియోగంపై సమీక్ష చేశారు. కొత్త లైట్ హౌస్ నిర్మాణానికి 1.5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఆయన వెంట అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రేపల్లె ఆర్డీఒ రామలక్ష్మి, తహశీల్దారు మోర్ల శ్రీనివాసరావు, ఎంపిడిఒ ఎన్ నాగలక్ష్మి, ఎఒ చుక్కా విజయరాజు పాల్గొన్నారు.