బాపట్ల (Bapatla) : గోవా (Goa) అధ్యయన పర్యటనలో భాగంగా 3వ రోజు ఎపి బృందం శనివారం దక్షిణ గోవా ప్రాంతంలో విస్తృతంగా పర్యటించింది. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (VinodKumar IAS)నాయకత్వంలోని బృందం గ్రామీణ నేపథ్యంలో ప్రశాంత సముద్రతీర ప్రాంతాల్లో అమలవుతున్న పర్యాటక విధానాలు క్షుణ్ణంగా పరిశీలించారు. గోవా పర్యాటక శాఖ అధికారులు అక్కడి నిర్వహణ విధానాలు వివరించారు. మొదటగా బృందం దక్షిణ గోవాలోని కోల్వా సముద్రతీరాన్ని సందర్శించింది. ఉత్తర గోవా తీరాలతో పోలిస్తే ప్రశాంత వాతావరణం, నియంత్రిత పర్యాటక కార్యక్రమాలు బృందాన్ని ఆకట్టుకున్నాయి. గాలి పారా చూట్ సవారి, జల మోటారు వాహన విహారం, వేగ నౌక ప్రయాణం, అరటి ఆకార నౌక సవారి వంటి జల వినోదాల్లో పాటిస్తున్న భద్రతా నిబంధనలు, అనుమతి విధానం, ప్రాంతాల విభజన విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. పర్యాటకుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. అనంతరం సుగంధ ద్రవ్యాల తోటను సందర్శించారు. సాగు విధానం, ఆరోగ్య ప్రయోజనాలు, సందర్శకులకు అవగాహన కల్పించే మార్గదర్శక విహారాలు గమనించింది.

జీడిపప్పు తయారీ ప్రక్రియ, జీడిపండుతో తయారుచేసే స్థానిక మద్యం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించింది. స్థానిక వంటకాలు, సుగంధ ద్రవ్యాల విక్రయం ద్వారా గ్రామీణులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తీరు అధికారులు వివరించారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా గోవాలోని భగవాన్ మహావీర్ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న గృహ వసతి కేంద్రం నిలిచింది. ఆరుగురు మహిళలు కలిసి మూడు పడక గదులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఇంటి వంట భోజనం, పక్షి వీక్షణ, ప్రకృతి మార్గ సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. గోవా రాష్ట్ర ప్రాణి అయిన భారత అడవి ఎద్దు (గౌర్)తో పాటు అరుదైన పక్షుల జాతులు ఇక్కడ కనిపిస్తాయని తెలిపారు.
ఈ విధానం గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయం అందిస్తున్నదని అధికారులు పేర్కొన్నారు. చివరిగా బృందం నదీ విహార సదుపాయాలు పరిశీలించింది. నదీ తీరంలోని ప్రార్థనా మందిరాలు, కోటలు, వారసత్వ కట్టడాలు చూపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకులను అలరించే విధానాన్ని అధ్యయనం చేశారు. వ్యర్థాల నిర్వహణ విధానాలపై అధికారులతో చర్చించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ గోవాలో అమలవుతున్న పర్యాటక విధానాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసే అవకాశాలపై బృందం సానుకూలంగా స్పందించింది. పర్యటనలో బాపట్ల పురపాలక కమిషనర్ జి రఘునాథరెడ్డి, చీరాల తహశీల్దారు కె గోపికృష్ణ, వేటపాలెం ఎంపిడిఒ ఎం రాజేష్ బాబు, జిల్లా పర్యాటక అధికారి అలీ అస్గర్ షేక్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రణాళిక నిర్వాహకులు శివ శరణ్, సజిత్ షేక్ పాల్గొన్నారు.






