– 63 మందికి రూ.30 లక్షల చెక్కులు అందించిన ఏలూరి
– టీడీపీ నేత గళ్ళ రామచంద్రరావుతో కలిసి పంపిణీ
– ఇప్పటి వరకు 14 నెలల్లో రూ.10,40,28,859 కోట్లు పంపిణీ
– వైసిపి హయాంలో పేదలకు ఆరోగ్య భద్రత కరువు
పర్చూరు (Parchuru) : పేదలకు చికిత్స అనే మాట బరువయ్యే ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సిఎం సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) భారీ ఆదరణగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు టీడీపీ సీనియర్ నేత గళ్ల రామచంద్రరావు అన్నారు. ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సిఫారసు మేరకు మంజూరైన 63 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమంపైనే ప్రధాన దృష్టి పెట్టిన ప్రభుత్వం, వైద్యం కోసం ఇబ్బంది పడే కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. గతంలో 2014 – 19 కాలంలో రూ.10 కోట్ల సీఎం సహాయనిధి అందిస్తే ఈ 14 నెలల్లో రూ.10.40కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ సహాయం అందించటం ప్రభుత్వం సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి మనిషి ప్రాణం విలువైనదని, డబ్బు లేక చికిత్స ఆగిపోవడం తమ ప్రభుత్వం సహించదన్నారు. అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో సీఎంఆర్ఎఫ్ అమూల్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు.

వైసీపీ హయాంలో ఆరోగ్య భద్రత కరువు
ఆరోగ్య భద్రత అందరికీ చేరాలనేదే ప్రభుత్వ ధ్యేయమని, వైసీపీ పాలనలో సీఎంఆర్ఎఫ్ నిరాదరణకు గురైందని ఏలూరి సాంబశివరావు అన్నారు. వైద్యం ఖర్చులు భరించలేని పేదల కోసం కీలకంగా ఉపయోగపడే సిఎం సహాయనిధి (CMRF) గత ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కనీసం వైసిపి కార్యకర్తలకు సైతం సీఎంఆర్ఎఫ్ అందించలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం పని చేసిందని ఆరోపించారు. వైద్య చికిత్స కోసం నెలల తరబడి ఎదురు చూసిన వృద్ధులు, అత్యవసర శస్త్రచికిత్సలకు డబ్బులు లేక ఇబ్బంది పడ్డ కుటుంబాలు అనేకం అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, శ్రీహరి, నాయుడు హనుమంతరావు, రంగయ్య చౌదరి, శంషుద్దీన్ పాల్గొన్నారు.






