– రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు ఆందోళన
– ములాఖత్ అనంతరం టిడిపి సీనియర్ నేత యనమల
రాజమహేంద్రవరం : తప్పుడు కేసులతో మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబును జైలులో పెట్టారని టిడిపి సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ఆరోపించారు. స్థానిక సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలసి ఆయన చంద్రాబాబుతో సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జైలులో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనన్న బాధలోనే చంద్రబాబు ఉన్నారని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని నేతను తప్పు చేసినట్లు సృష్టించి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. రాష్ట్రాన్ని దోచిన వాళ్లే చంద్రబాబు తప్పు చేశారని చెబుతున్నారని దుయ్యబట్టారు. మచ్చలేని వ్యక్తిని జైల్లో పెడితే బాధపడకుండా ఉంటారా? ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధించి, హింసిస్తోందని ప్రజలు గుర్తించారని అన్నారు.
కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులపై బాధపడ్డారు. రాష్ట్రాన్ని వైసిపి పాలకులు ధ్వంసం చేస్తుంటే చంద్రబాబు సంతోషంగా ఎలా ఉంటారని యనమల ప్రశ్నించారు. గతంలో జగన్ ముఠా దోపిడీని సీబీఐ రుజువు చేసిందని అన్నారు. అయినా వారు దర్జాగా జనంలో తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రభవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. జైలులో కనీస సదుపాయాలు లేకపోయినా తన సౌకర్యాల గురించి చంద్రబాబు బాధపడటం లేదని అన్నారు. ప్రజల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇది జాతీయ స్థాయి అంశమని అన్నారు. కోర్టు విషయాలు బయట మాట్లాడటం సమంజసం కాదన్నారు.
రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, కుటుంబ సభ్యులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీనేతలు ఆదిరెడ్డి వాసు, మంతెన సత్యనారాయణరాజు, పెందుర్తి వెంకటేష్ పాల్గొన్నారు.