Home బాపట్ల ఏ అధికారం ఉందని స్థల పరిశీలన చేశారు : మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు

ఏ అధికారం ఉందని స్థల పరిశీలన చేశారు : మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు

113
0

చీరాల : ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతితో ఏర్పాటు చేసుకోవడం చట్టబద్దమైనప్పుడు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏ అధికారంతో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదించిన అంశంపై పరిశీలన చేశారని మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు ప్రశ్నించారు. శనివారం తన వైద్యశాల ఆవరణలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడియార స్థంభం సెంటర్లో ఎన్‌టిఆర్‌ విగ్రహ నిర్మాణానికి అనుమతి కోరుతూ తాను మున్సిపల్‌ కౌన్సిల్‌కు చేసుకున్న ధరకాస్తుతోపాటు మరో 14మంది కౌన్సిలర్లు చేసుకున్న ధరకాస్తును కూడా కౌన్సిల్‌ ఆమోదించిందని తెలిపారు. రెండు విగ్రహాలు రెండు చోట్ల ఏర్పాటు చేసుకునేందుకు కౌన్సిల్‌ ఆమోదించినప్పుడు ఒక చోట రద్దు చేస్తామని చెప్పడం వెనుక జెసి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. చీరాల పట్టణానికి ఉన్న ప్రాధాన్యతల్లో గడియార స్థంభం కూడలి అత్యంత ప్రధానమైనదని, అక్కడ ఎన్‌టిఆర్‌ విగ్రహ నిర్మాణానికి ఆమోదం రావడం చారిత్రాత్మకం అన్నారు. అలా కాకుండా గోపాలకృష్ణయ్య పార్కుకు ఉత్తరం అంటే సులభ్‌ కాంప్లెక్స్‌ మరుగుదొడ్ల పక్కన అన్నగారి విగ్రహంకు అనుమతి ఇవ్వడానికి ఏమి అధికారం ఉందని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్‌ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వైసిపి అనుబంధ వ్యక్తిలా జెసి మాట్లాడారని ఆరోపించారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌లో వైసిపి ఛైర్మన్‌ అనుమతి ఇచ్చారు కాబట్టే గౌరవంగా పిలిచి వాళ్లతో కొబ్బరికాయ కొట్టించామని, శాస్త్రోక్తంగా మరోసారి శంకుస్థాపన చేస్తామని, అప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం పార్టీ నాయకులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. తాను వైసిపి కౌన్సిలర్ల మద్దతు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించే వాళ్లెవ్వరైనా ప్రస్తుతం కౌన్సిల్‌లో వైసిపి ఛైర్మన్‌ సంతకం లేకుండా విగ్రహం పెట్టగలరా? అని ప్రశ్నించారు. వైసిపి ఛైర్మన్‌ పోడియంపై కూర్చుంటే అతనికి ఎందురుగా కౌన్సిలర్లతో కలిసి ఎంఎల్‌ఎ ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. వైసిపిపై అంత పౌరుషం ఉంటే అలా వెళ్లకూడదు కదాని అన్నారు. తాను ఇప్పటి వరకు ఎంపి వద్దకు వెళ్లలేదని, ఎంపిపై ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టే తాను ఇకనుండి ఎంపి వద్దకు వెళతానని ప్రకటించారు. ఎన్‌టిఆర్‌ విగ్రహం ఏర్పాటులో వైసిపి, కాంగ్రెస్‌ వాళ్ల మాటలు విని గడియార స్థంభం సెంటర్లో అన్నగారి విగ్రహానికి ఏ విధంగా అభ్యంతరం చెబుతారని, కౌన్సిల్‌ ఆమోదించాక ఇంకెవరి అనుమతి అవసరం లేదని అన్నారు. వైఎస్‌ఆర్‌ విగ్రహానికన్న ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను విగ్రహ శంకుస్థాపన రోజు శాసన సభ్యునితోపాటు పార్టీ అధ్యక్షులను ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానిస్తానని, 14మంది కౌన్సిలర్లు అనుమతి పొందిన విగ్రహ నిర్మాణానికి తనను ఆహ్వానిస్తే తాను హాజరవుతానని తెలిపారు.