Home బాపట్ల
164
0

– గత సమావేశంలో అవిశ్వాసంపై ప్రకటన చేసిన కొండయ్య  – దీంతో గ్రూపులు కట్టిన కౌన్సిలర్లు  – అవిశ్వాసంపై ఊహాగానాలతో వేడెక్కిన రాజకీయం – ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాలి

చీరాల : గతనెల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుకు శాసన సభ్యులు ఎంఎం కొండయ్యకు మద్య కొద్దిపాటి వాదన చోటు చేసుకుంది. ఆ సమయంలో త్వరలో అవిశ్వాసం పెట్టాల్సి వస్తుందని శాసన సభ్యులు కొండయ్య మాట్లాడటం అప్పట్లో పెద్దగా చర్చకు రానప్పటికీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈనెల 18కి మున్సిపల్‌ పాలకవర్గం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తవుతుంది. మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం నాలుగేళ్ల తర్వాత ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం వచ్చింది.

2020 మున్సిపల్‌ ఎన్నికల్లో ఇలా….

గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాను సింబల్‌పై 21మంది గెలవగా స్వతంత్రులుగా 11మంది, టిడిపి సైకిల్‌ సిబంల్‌పై ఒకరు గెలుపొందారు. అప్పట్లో స్వతంత్రంగా గెలిచిన 11మంది కూడా మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌ ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసిపికి మద్దతు ప్రకటించారు. టిడిపి సింబల్‌పై గెలిచిన ఒక కౌన్సిలర్‌ కూడా అప్పటి శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తికి మద్దతు ప్రకటించారు. ఇలా కౌన్సిల్‌ మొత్తం వైసిపికి అనుకూలమైంది. ఛైర్మన్‌గా జంజనం శ్రీనివాసరావు, వైస్‌ఛైర్మన్లుగా బొనిగల జైసన్‌బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు ఎన్నికయ్యారు.

2024సాధారణ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు ఇలా…

2024సాధారణ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. టిడిపి అభ్యర్ధిగా ఎంఎం కొండయ్య శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలోనే వైసిపి కౌన్సిలర్లు కొందరు టిడిపికి మద్దతు ప్రకటించగా ఎన్నికల తర్వాత మరి కొందరు టిడిపి మద్దతు ప్రకటించారు. అలా ప్రస్తుతం టిడిపి మద్దతు దారులుగా 14మంది కౌన్సిలర్లు ఉండగా వైసిపిలో 14మంది, ఆమంచి కృష్ణమోహన్‌ ప్యానెల్‌గా ఐదుగురు స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు.

అవిశ్వాసం పెట్టాలంటే….

అవిశ్వాస తీర్మానం ప్రవెశపెట్టడానికి సగానికిపైగా కౌన్సిలర్ల మద్దతు ఉండాలి. అలాటప్పుడు టిడిపి అవిశ్వాసం ప్రకటించి నెగ్గించుకోగలదా?

ఎవరి బలమెంత?

33మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో ప్రస్తుతం టిడిపి శిభిరంలో 14మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎంఎల్‌ఎ, ఎంపి ఓట్లు కూడా కలుపుకుంటే 16అవుతుంది. ప్రస్తుతం మారిన నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్లో శాసన సభ్యులు కొండయ్య, మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌ ఇద్దరూ అవగాహనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో స్వతంత్ర కౌన్సిలర్లు ఐదుగురు మద్దతు ప్రకటిస్తారనుకుంటే 21 అవుతుంది.

అయితే ఆమంచి కృష్ణమోహన్‌ నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకునే ఎత్తగడలతో ఉండే వ్యక్తి. అలాంటప్పుడు ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందనేది ముందుగా ఎవ్వరూ ఊహించలేరు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో వైసిపికి మద్దతు ప్రకటిస్తారనుకుంటే టిడిపికి మద్దతు ప్రకటించి మోదడు రమేష్‌ను ఛైర్మన్‌ చేయడంలో ఆమంచి కృష్ణమోహన్‌ తన మార్కు చూపుకున్నారు.

ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొవడానికి కరణం వర్గం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో వేచి చూడాలి. మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి జోక్యం చేసుకుంటే టిడిపి శిభిరంలో ఉన్నవాళ్లలో జారిపోకుండా ఉంటారా? కొండయ్యతో ఉన్న కొందరు కౌన్సిలర్లు కరణం బలరామకృష్ణమూర్తితో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం ఉంది. ఛైర్మన్‌పై అవిశ్వాసం పెడితే నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన శైలిలో క్రియాశీలకంగా ఉండే మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు ఎన్‌టిఆర్‌ విగ్రహ నిర్మాణ వివాద నేపధ్యంలో ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జంజనం శ్రీనివాసరావును కాదంటే… ఎవరు?

మున్సిపల్‌ రాజకీయాల్లో జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం పెడితే ప్రస్తుతం శాసన సభ్యులు కొండయ్య ఎవరిని ప్రతిపాదిస్తారనేది చర్చనీయాంశమే. రాజకీయ పార్టీలతోపాటు సామాజిక పొందిక కూడా ఇక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శాసన సభ్యులు కొండయ్య మద్దతుదారులుగా ఉన్న కౌన్సిలర్లలో పొత్తూరి సుబ్బయ్య, సూరగాని లక్ష్మి, మించాల సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అవిశ్వాసం పెడితే ఛైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. జంజనం శ్రీనివాసరావు సామాజికవర్గం నుండే అభ్యర్ధిని ఎంపిక చేయాల్సి వస్తే కౌన్సిలర్‌ దాసరి శారద పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎంపికల్లో ఆమంచి కృష్ణమోహన్‌ మద్దతు పొందే క్రమంలో ఆమంచి మద్దతుదారునిగా ఉన్న దాసరి శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది. అయితే ఛైర్మన్‌ ఎపికలో ఉంటాడా? లేక వైస్‌ఛైర్మన్‌కు ప్రతిపాదిస్తారా? అనేదీ చూడాలి. వీరిలో సామాజికవర్గాల పొందిక, ఆర్ధిక వనరులు, ఎంఎల్‌ఎ కొండయ్య ప్రత్యర్ధులను ఇరుకునపెట్టే ఎత్తుగడలు అభ్యర్ధి ఎంపికలో కీలకం కావచ్చు.