చీరాల : నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా చీరాల కేంద్రంగా జిల్లా ప్రతిపాదన ఉద్యమ రూపం తీసుకుంది. జిల్లా సాధనకు ఏర్పాటైన కమిటీకి తాడివలస దేవరాజును కన్వీనర్ గా ఎన్నుకున్నారు. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్, ప్రకాశం, నెల్లూరు ఆరు జిల్లాల గ్రేటర్ రాయలసీమను 12జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనల్లో చీరాల కేంద్రంగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు, అడ్డంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో నూతన జిల్లా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు తర్వాత ప్రధాన పట్టణంగా ఉన్న చీరాల భౌగోళిక, చారిత్రక అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా అభివృద్ధి మందగించింది. అధికారంలో ఉన్న పార్టీలు, నేతలు వివక్షకు గురి చేశారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు ఏర్పడ్డ ఐఎల్టీడీ, నెహ్రు కాలంలో ప్రారంభించిన నులూమిల్లు ఆతర్వాత కెపాల్, ఇప్పుడు బ్రహ్మాస్ మిల్ తప్ప ఎలాంటి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రోత్సహించలేదు. జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కందుకూరు, మార్కాపురం, ఒంగోలు పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన గత ప్రభుత్వాలు చీరాలను విస్మరించాయి.
నెహ్రు కాలంలో ప్రారంభించిన నూలు మిల్లు 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సహకార చట్టంతో మూతపడింది. ఆతర్వాత 2009లో వైఎస్సార్ మరణానంతరం వచ్చిన కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నూలు మిల్లును ఆనంద్ గ్రూప్ కంపినీకి విక్రయించారు. అలా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మిల్లు ప్రజలకు దూరమైనది.
కొన్నేళ్లుగా అభివృద్ధిలో వివక్షకు గురైన చీరాల ప్రాంతం 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. 2007లో మోటుపల్లిలో వాంపిక్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనతో భూములకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం కూడా వాంపిక్ కోసం భూములు సేకరించింది. 2010లో వాంపిక్ భూముల సేకరణ వివాదంపై కోర్టు విచారణ నేపధ్యంలో వాంపిక్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సమయంలోను చీరాలను అన్యాయం చేశారు. ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండీ, అన్నింటికీ కేంద్రంగా ఉన్న చీరాలను కాకుండా మూడు నియోజకవర్గాలతో ఉన్న గుంటూరు జిల్లా బాపట్లను పార్లమెంట్ నియొకవర్గ కేంద్రంగా చేశారు. అలా చీరాల అభివృద్ధి కి ఆటంకం ఏర్పడింది.
ప్రస్తుతం వాంపిక్తోపాటు ఇతర అభివృద్ధి పనులకు చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే అన్నిరకాలుగా పరిపాలన సౌలభ్యం కలుగుతుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి. రైలు, రోడ్డు, జల రవాణా సదుపాయాలు ఉన్నాయి. వీటితోపాటు ఒక గంట ప్రయాణ దూరంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు అందుబాటులో ఉంది. మూడు లక్షలకుపైగా జనాభా ఉన్న పట్టణం. స్వాతంత్ర్య ఉద్యమంలో దేశప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా స్ఫూర్తి వంతమైన సహాయనిరాకరణోద్యమం ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో సాగించిన చీరాల ఇంతకాలం అన్ని వసతులు ఉండీ వివక్షకు గురైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చీరాలకు జిల్లా కేంద్రంగా మహర్దశ పట్టనుంది. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తికి గౌరవం దక్కనుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు కదలాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పడిన సాధన సమితికి రాజకీయాలకు అతీతంగా సహకరించేందుకు ప్రజాసంఘాలు ముందుకు వచ్చాయి.