Home ప్రకాశం జిల్లా సాధన మన హక్కు : చీరాల జిల్లా జేఏసీ

జిల్లా సాధన మన హక్కు : చీరాల జిల్లా జేఏసీ

238
0

– చేయి చేయి కలుపుదాం చీరాల జిల్లా సాధనకు కృషి చేద్దాం
– చీరాల జిల్లా కేంద్రం కాకపోతే వ్యాపారం, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో తీవ్ర నష్టం
– జిల్లా కేంద్రం పేరుతో బాపట్లలో రియల్ ఎస్టేట్ భూమ్
– పోరాడకపోతే ట్విన్స్ సిటీ పోయి సింగల్ సిటీ మిగులుతుంది
చీరాల : బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఏర్పడే నూతన జిల్లాకు చీరాల పేరాల ఉద్యమం నేత, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కోసం చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో చీరాలలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటియుసి ఆఫీస్ నందు సమావేశం నిర్వహించారు. చీరాల జిల్లా జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు.

చీరాల జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటుతో 20 సంవత్సరాల అభివృద్ధిని సాధించవచ్చని చెప్పారు. లేనియెడల విద్య, వైద్య, వ్యాపార, పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాలలో తీవ్ర నష్టాన్ని చూడవలసి వస్తుందన్నారు. చీరాలలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కుల, మత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగస్తుల సంఘాలతో కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. త్వరలో చీరాల జిల్లా సాధించకపోతే కోల్పోయే వాటిని వివరిస్తూ కరపత్ర రూపంలో ఇంటింటికి ప్రచారం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.

మేడ వెంకట్రావు, బత్తుల శామ్యూల్, గోసాల ఆశీర్వాదం, రావూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనం జిల్లా సాధన కోసం పోరాడుతూ రాజకీయ ఒత్తిడితో మాత్రమే జిల్లా కేంద్రం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గ అధికార, ప్రతిపక్షం నాయకులు అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఊటుకూరు వెంకటేశ్వర్లు, శ్రీధర్, అమిత్ మాట్లాడుతూ అధికారులతో పాటు, రాష్ట్ర గౌరవ సలహాదారులు, మంత్రులను కలిసి చీరాలకు జరిగేటటువంటి నష్టాన్ని వివరించాలని తెలిపారు. పోస్టుకార్డు ఉద్యమం మొదలు పెట్టాలని తెలిపారు.

గూడూరి శివరామ ప్రసాద్, రహీమ్, బెల్లంకొండ సురేష్, కిషోర్, చంద్రశేఖర్ మాట్లాడుతూ చీరాల అభివృద్ధికి సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఇదే ఆఖరి పోరాటమని అన్నారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నదన్నారు. ప్రతి ఒక్క వ్యాపారసంస్థ, ఉద్యోగస్తులు, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రం అయితే సుమారు రోజు 10వేల మంది రాకపోకలు ఉంటాయన్నారు. అందువలన రవాణా, వస్త్ర, జీడిపప్పు వ్యాపారం, హోటల్స్ అభివృద్ధితో పాటు అనేక మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, ఏఐటియుసి సభ్యులు, బీసీ సంఘం నాయకులు, రాజశేఖర్ రెడ్డి, ప్రభాకర్, మురళి, నరేంద్ర పాల్గొన్నారు.