ఖాజీపాలెం : కెవిఆర్ అండ్ ఎంకెఆర్ డిగ్రీ కళాశాలలో మంతెన వెంకటరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ, కృష్ణ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల స్థాయి వక్తృత్వం, వ్యాసరచన పోటీలు ఈ నెల 24న నిర్వహించారు. పోటీల్లో చీరాల చైతన్యభారతి డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం బికాం చదువుతున్న పేరం కావ్యశ్రీ వక్తృత్వం పోటీలలో ప్రధమ స్థానం సాధించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా విజేతకు రూ.5వేల నగదు, ప్రశంసాపత్రంతో పాటు కళాశాలకు జ్ఞాపిక అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థినికి కళాశాల ఆవరణలో సోమవారం అభినందన సభ నిర్వహించారు. సభలో ప్రిన్సిపాల్ ఎన్ సోమేశ్వరరావు మాట్లాడుతూ “యూనివర్సిటీల స్థాయిలో ఇలా ప్రధమ బహుమతి పొందటం వరుసగా మూడవసారని తెలిపారు. ఇంతటి విజయాన్ని సాధించి కళాశాలకు పేరు తెచ్చిన పేరం కావ్యశ్రీని అభినందించారు. కార్యక్రమంలో యాజమాన్యం ముంగర రాంబాబు, సురేష్, ఉమ్రాన్, అధ్యాపకా అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.