చీరాల : పట్టణంలోని ముక్కోణం పార్కు (డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్) వద్ద అంబేడ్కర్ సర్కిల్‌లో దళిత, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా చేపడుతున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహం నిర్మాణం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్‌చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ముక్కోణం పార్క్ వద్ద చేపడుతున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహ పనులను అధికారులు ప్రజా విరుద్దంగా చేపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్ విగ్రహన్ని కనీసం ఏ ఒక్కరికి తెలియజేయకుండా అధికారులు ఇస్టానుసారంగా తొలగించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. కనీసం అంబేడ్కర్ అంటే అవగాహన లేని, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను నిర్మాణ కమిటీలో చేర్చడం సిగ్గుచేటుగా ఉందన్నారు. అసలు కాంస్య విగ్రహం రూపాన్ని, ప్లానింగ్, నమూనాలను దళిత, ప్రజాసంఘాలు కోరినా ఇవ్వకుండా కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయంతో అధికారులు చేపడటం దుర్మర్గపు చర్యని ఆరోపించారు. వెంటనే పనులను నిలుపుదల చేసి దళిత, ప్రజాసంఘాల సలహాలను, సూచనలు పరిగణలోకి తీసుకోని కోరారు. ప్రజల సమన్వయంతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. లేకుండా అధికారులకు భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబూరావు, క్రిస్టియన్ వాయిస్ ప్రతినిధి నీలం శామ్యూల్‌మోజెస్, బిఎస్‌పి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొర్రెపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.