Home ప్రకాశం చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు : రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు

చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు : రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు

66
0

రేపల్లె (Repalle) : అమలు చేయలేని అబద్ధపు మేనిఫెస్టోతో చంద్రబాబు (Chandrababu) అతని టీం బయలు దేరిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు (MP Mopidevi Venkata Ramanarao) ఎద్దేవ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. 2014లో అబద్ధపు వాగ్దానాలు మేనిఫెస్టోలో చేర్చి వాటిని అమలు చేయకుండా చివరకు ఆన్లైన్లో మేనిఫెస్టో తొలగించారని అన్నారు. అలాంటి అబద్ధపు వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. గతంలో పరిపాలించి ఏ ఒక్కరికీ న్యాయం చేయకుండా తన అనుచర గణానికి మాత్రమే న్యాయం చేశారని అన్నారు.

జగన్ పేదల కోసం నిరంతరం శ్రమిస్తుంటే చంద్రబాబు మాత్రం పెత్తందారులకు దోచి పెట్టేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకొస్తే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామనే దృక్పథంలో ఉన్నారని, చంద్రబాబు తన పరిపాలనలో చేసిన వాగ్దానాలు ఒకటి కూడా అమలుచేసిన దాఖలాలు లేవని అన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయలేదని అన్నారు. రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు హామీలు నెరవేర్చడంలో విఫలమైతే జగన్ నవరత్నాలను నెరవేర్చడమే కాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. కానీ ఇప్పుడు బాబు షూరిటీ గ్యారెంటీ అంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన జగన్‌ను (CM YS JaganmohanReddy) 2వసారి సిఎంగా ఎన్నుకుంటారని అన్నారు. మార్చి 10న జరగబోయే సిద్ధం సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు. సమావేశంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ఈవూరి గణేష్, వైసిపి పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.