ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇటీవల కాలంలో బాపట్ల జిల్లాకు రెండోసారి వచ్చారు. గతంలో బస్సు యాత్ర సందర్భంగా బాపట్ల వరకు వచ్చారు. రాత్రికి బాపట్లలోనే బస చేశారు. బస్సు యాత్ర చీరాల వస్తుందని అప్పట్లో ప్రకటించారు. కానీ వర్షం సాకు చెప్పి చీరాల పర్యటన రద్దు చేసుకున్నారు. తాజాగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో మిచౌంగ్ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు. అక్కడ జరిగిన నష్టమే చీరాల నియోజకవర్గంలోనూ జరిగింది. కానీ చీరాలవైపు రావడానికి కూడా ప్రయత్నం చేయడంలేదు.రెండు సార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు చీరాల రాకపోవడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానంగా ఉన్నట్లు చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి వైసిపికి మద్దతు ప్రకటించడం ఒక కారణమైతే…. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న కొండయ్య పట్ల సానుకూలత లేదనే ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఇవన్నీ ఒక కారణమైతే మాజీ మంత్రి, సీనియర్ నేతను ఒప్పించుకుని పార్టీలోకి ఆహ్వానించడం కూడా కారణమని చర్చిస్తున్నారు. అయితే ఆ మాజీ నేత ప్రస్తుతం వైసిపికి దూరంగా ఉంటున్నారు. టిడిపిలోకి వెళ్లాలన్న ఆలోచన ఉన్నప్పటికీ తనకు తానుగా వెళ్లను. వాళ్లే పిలవాలి అన్నట్లు భీష్మించుకోవడం. ఆ నేతను పిలుచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ దగ్గరకు వెళ్లినప్పుడైనా రాకపోతాడా! పిలవడం ఏమిటని చంద్రబాబు ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇలా అటు చంద్రబాబు, ఇటు మాజీ మంత్రి ఇద్దరి మద్య మాటలు కలవకపోవడమే చంద్రబాబు చీరాల పర్యటనకు రాకపోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. అయితే చీరాల పర్యటనకు బలమైన నేత ఉంటేనే సాధ్యమనే ఆలోచనతో బాబు పర్యటనకు రావడంలేదనే అంచనాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా అనేక రాజకీయ అంశాలతో ముడిపడ్డ చంద్రబాబు పర్యటన రెండోసారి కూడా చీరాలవైపు కన్నెత్తి చూడకుండా వెళ్లడం వరద బాధితుల పరామర్శ ఒక ఎత్తయితే… రాజకీయ కారణాలు కూడా మరో కారణంగా భావిస్తున్నారు.