చీరాల : బాల, బాలికలు రక్షణకు అందరూ బాధ్యత వహించాలని, బాల్యంలో చిన్నారుల స్వేచ్ఛకు భంగం కలుగకుండా చూడాలని హెల్ప్ లైన్ డైరెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ఆడుకునే వయస్సులో బాల, బాలికలపై మార్కులు, చదువుల భారంతో వత్తిడి చేయవద్దన్నారు. బాల, బాలికల రక్షణపై చీరాల ఎన్జీవో హోంలో శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బాలికలను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు తరలించే సంస్కృతి ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. బాలికలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలన్నారు. అలాంటి కఠినమైన శిక్షపడితే తర్వాత నేరం చేయాలనుకునే వారు భయపడతారని చెప్పారు. అదే విధంగా బాల్య వివాహాలను కూడా అరికట్టాలన్నారు. బాల్యవివాహాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రతినిధి బివి సాగర్, ఆనంద్, డేవిడ్ రాజ్ పాల్గొన్నారు.