డిల్లి : నమో అంటే నమ్మించి మోసం చేయడం అని మరోసారి మోడీ మరోసారి రుజువు చేసుకున్నారు. ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ మరోసారి తెలుగు ప్రజలను మోసం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదని కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తున్న ఊకదంపుడు ప్రచారాన్నే కేంద్రం తన ఆఫీడవిట్లో పొందుపరిచింది. బీజేపీ నేతల సొల్లు కబుర్లనే కేంద్రం అత్యున్నత స్థానానికి నివేదించింది. పొంగులేటి పిటిషన్‌లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీం కోర్టులో పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్‌కు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం మరోసారి అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం ప్రకటించలేదు.
ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ అందులో పొంగులేటి సుధాకరరెడ్డి కోరారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో పాత అబద్దాలనే వల్లె వేసింది. అన్ని చేసేసామంటూ కోతలు కోసింది. కొన్నాళ్లుగా బీజేపీ నేతలు రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిలో 85 శాతం పూర్తి చేశామని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలిసారి 85 శాతం కాదు మొత్తం చేసేసామని కేంద్రం పేర్కొనడం గమనార్హం.