Home ఆంధ్రప్రదేశ్ దేశంలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉందా..? లేదా..?

దేశంలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉందా..? లేదా..?

375
0

అమరావతి : దేశంలో అసలు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉందా..? లేదా చచ్చిపోయిందా..? అని టీడీపీ అధికార ప్రతినిధి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ కేంద్రాన్ని ప్రశ్నించారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలపై డొల్లతనం ఉందన్నారు. మే 27న ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రజల ఇబ్బందులపై మాట్లాడాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తుందని ఆమె తెలిపారు.

గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం సగటు మనిషి ఆదాయానికి గండికొడుతూనే వస్తోందని ఆరోపించారు. దీనిలో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయన్నారు. కనీసం దీనిపై వివరణ ఇచ్చే పరిస్థితిలో కూడా కేంద్రం లేదని మండిపడ్డారు. కేంద్రం తన ఇష్టారీతిన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా దేశంలో తగ్గించే పరిస్థితి లేదన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ.. రూ.2లు తూతూ మంత్రంగా తగ్గిస్తున్నారని, ఎలక్షన్స్ అయినవెంటనే మళ్లీ పెంచేస్తున్నారని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్, కర్ణాటక ఎన్నికలే అని తెలిపారు. కేంద్రం పరిపాలన విధానం జూదంలా మారిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటేనే దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయని ఆమె తెలిపారు. అక్కడ విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడమేంటని ప్రశ్నించారు.

జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అంశాలలో డొల్లతనం ఉందన్నారు. జీఎస్టీ అమలు చేసే విధానంలో అవకతవకలున్నాయన్నారు. దీనిలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ ఒకటికి రెండు, మూడు సార్లు, ఢిల్లీ వెళ్లి ఆర్థికమంత్రి యనమల చెప్పడం జరిగిందని పంచుమర్తి అనురాధ తెలిపారు. అయినా కేంద్రం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. అదేమిటని గట్టిగా ప్రశ్నిస్తే.. కేంద్రం నుంచి 42 శాతం రాష్ట్రాలకు వాటా వస్తుందని చెబుతున్నారు. 42 శాతం నిధులు రావడంలేదని పార్లమెంట్ లోనే ఒక ప్రశ్నకు సమాధానంగా సంబంధిత ఎంపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 36 శాతం నిధుల మాత్రమే వస్తున్నాయని అధికారికంగా తెలిపారు. మరో వైపు 15వ ఆర్థిక సంఘం విషయం. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు. దీనిపై రాష్ట్రపతి వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని కూడా అందజేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఫైనాన్స్ మినిస్ట్రీ అసలు ఏం చేస్తోంది. అసలు ఈ దేశంలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉందా..? లేదా? అని అనురాధ ప్రశ్నించారు. ఉంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించవచ్చు కదా? దాని మీద కసరత్తు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏ కసరత్తు ఎందుకు చేయరని మండిపడ్డారు. ఫైనాన్షియల్ మిస్ మేనేజ్ మెంట్ గురించి ఒక్కసారైనా ఫైనాన్స్ మినిస్ట్రీ కూర్చుందా?, అధికారులతో ఏమైనా సమీక్షలు నిర్వహించిందా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ గారు విదేశీ పర్యనలలో ఏనాడైనా ప్రజలకు డైరెక్ట్ గా ప్రభావం చూపే ఒప్పందాలేమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఆంక్షలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఇరాన్ నుంచే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేలా.. ఏమైనా ప్రయత్నాలు చేశారా? అని ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. దేశ, విదేశాలు ప్రధాని మోడీ ఎందుకు తిరుగుతున్నారు? కనీసం దృష్టి పెట్టే పరిస్థితి లేదని విమర్శించారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పాటు, పారిన్ ఫాలసీ మిస్ మేనేజ్ మెంట్ మీద సమాధానం చెప్పాలని కోరారు. ఫైనాన్షియల్ మిస్ మేనేజ్ మెంట్ మీద సమాధానం చెప్పాలని టీడీపీ తరపున ఆమె డిమాండ్ చేశారు.