రేపల్లె : గుంటూరు జిల్లా రేపల్లె శివారు ప్రాంతం అక్కిలేరు వంతెన వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్సు పెళ్లి ప్రయాణికులను తీసుకెళుతు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే రేపల్లె 19వార్డుకు చెందిన పుప్పాల శ్రీనివాస్ రావు కుమార్తె వివాహం బాపట్లలో ముగించుకొని తిరిగి పెళ్లి కుమార్తె స్వస్థలమైన రేపల్లెకు వస్తున్న క్రమంలో తెల్లవారుజామున అక్కిలేరు వంతెన వద్దకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఉదయం ఆరు గంటల సమయంలో రోడ్డు పక్కనే ఉన్న తాడి చెట్టుకు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సు నుజ్జునుజ్జయింది.
సంఘటన స్థలంలోనే మన్యం సాయి కిరణ్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అంతే కాకుండా మరో 9మందికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు, తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.