చీరాల (Chirala) : మండలంలోని ఈపూరుపాలెం (Epurupalem) ప్రధాన రహదారి వెంబడి నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చేపట్టిన పనుల్లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. పాఠశాల సమీపంలో చెట్టు కొమ్మలు తొలగిస్తున్న సమయంలో విరిగిన కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో నాలుగు తీగలు తెగి ఆగి ఉన్న పాఠశాల బస్సుపై పడి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులు కాలిపోవడం, ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రూరల్ ఏఈ బ్రహ్మంను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా నూతన విద్యుత్ స్తంభాల పనుల్లో భాగంగా ఎల్‌టీ లైన్లను నిలిపివేసి సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అయితే 11 కెవి లైన్‌కు విద్యుత్ సరఫరా ఉండటంతో చెట్టు కొమ్మలు తీగలను తాకి స్వల్పంగా నిప్పు రవ్వలు వచ్చాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.






