Home ఆంధ్రప్రదేశ్ పేదల పొట్టకొట్టేందుకు బిజెపి కుట్ర : పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపణలు

పేదల పొట్టకొట్టేందుకు బిజెపి కుట్ర : పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపణలు

7
0

పర్చూరు (DN5 News) : పేదలకు ఉపాధి చూపుతున్న ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రద్దు చేసే కుట్ర కేంద్రప్రభుత్వం చేస్తుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి (PCC President ys Sharmila Reddy) ఆరోపించారు. ఇంకొల్లు సినిమా హాల్ సెంటర్లో ఉపాధి హామీ పథకం గురించి నిర్వహించిన రచ్చబండలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలు పలువురు చేత వారి అభిప్రాయాలన్ని సభలో బహిరంగంగా చెప్పించారు. సభలో వారు చెప్పిన సమస్యలు విన్న అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో పేదల ఉపాధి కొరకు ప్రవేశపెట్టిన పథకాన్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తుందని అన్నారు. మహాత్ముని పేరు తొలగించి విబిజిఆర్‌ఎఎంజి ఉపాధి హామీ పథకమని నామకరణం చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పొడిగించామని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని అన్నారు. గతంలో 100 రోజులు పని కల్పించిన పథకాన్ని 125 రోజులు పని దినాలు కల్పించామని చెబుతున్నప్పటికీ అందులో చిత్తశుద్ధి లేదన్నారు.

మాజీ సిఎం జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) రాష్ట్రాన్ని రాజధానిలేని రాష్ట్రంగా మార్చారని అన్నారు. ప్రస్తుత సిఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu), మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇరువురు కలిసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని అన్నారు. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. అప్పులైతే చేశారు కానీ రాజధాని మాత్రం లేదని, పోలవరం పూర్తి కాలేదని అన్నారు. సమస్యలు అలానే ఉన్నాయని తెలిపారు. మన పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, మహారాష్ట్రకు రాజధాని ఉందని, ఇటీవల ఏర్పడిన తెలంగాణకు రాజధాని ఉందని అన్నారు. కానీ మనకు మాత్రం రాజధాని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మళ్లీ ఎప్పటిలా కొనసాగించే విధంగా పోరాటం చేయాలని అన్నారు. లేకుంటే ఆ నూతన పథకం ద్వారా పేదలకు ఉపాధి లభించదని తెలిపారు.

కేంద్రంలో ప్రభుత్వం మారితేనే రాష్ట్రంలో పరిస్థితులు మారుతాయని అన్నారు. మహాలక్ష్మి పథకం కొనసాగటం లేదని ఎద్దేవ చేశారు. కూటమి ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రంలోనూ రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సభలో పలువురు, ఉపాధి హామీ పథకం, పింఛన్లు గురించి తమ అభిప్రాయాలు తెలిపారు. చిన్నగంజాం మండలానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త చనిపోయిన గత జగన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వితంతు పింఛన్ మంజూరు కాలేదన్నారు. తన మనవడికి అమ్మబడి పథకం రాలేదన్నారు. ఇంకొల్లుకు చెందిన మది అంధుడు మాట్లాడుతూ తనకు వికలాంగ పింఛన్ రాలేదని తెలిపారు. మాజీ ఎంపీ జెడి శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఇన్చార్జి జ్యోతి కుమారి, పొన్నగంటి జానకిరామ్ మోదిన్ భాష, షేక్ యూసుఫ్, షేక్ అబ్దుల్ రహీం, అంబేద్కర్, అంజిబాబు పాల్గొన్నారు.