కందుకూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి, రాష్ట నాయకత్వ శిక్షిణాశిభిరం డైరెక్టర్ దాసరి రాజామాస్టారు పేర్కొన్నారు. పార్లమెంటులో టిడిపి పోరాటానికి విపక్షాలు సైతం మద్దతు ఇస్తున్నప్పటికీ, లోక్ సభ స్పీకర్ కేవలం సభ ఆర్డర్‌లో లేదనే సాకుతో అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించక పోవడం చూస్తుంటే బిజెపికి ప్రజాస్వామ్య విధానం అంటే లెక్క లేదనే విషయం అర్ధం అవుతుందని చెప్పారు. స్థానిక తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరంలో 162 వ బాచ్ ప్రారంభ సభకు హాజరైన నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రధాని మాన్‌కి బాత్ కార్యక్రమంలో రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని, మహానుభావునిగా పెరుతెచ్చుకున్నారని కొనియాడినప్పటికీ గత 14 రోజులుగా పార్లమెంట్‌లో జరిగే తీరు చూస్తుంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఏవిధంగా తూట్లు పొడుస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ ఆత్మ ఘోషించే విధంగా బిజెపి వ్యవహార శైలి ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం మీద చర్చ కావాలని టీడిపి అభ్యర్ధిస్తున్నా సభానాయకునిగా దానిని ఆమోదించే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇదేనా అంబేద్కర్ మీద, ప్రజాస్వామ్యం మీద మీకు ఉన్న గౌరవం అని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఈ దేశంలో 26సార్లు అవిశ్వాస తీర్మానాలు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారని రాజా మాస్టారు చెప్పారు. అప్పుడున్న ప్రధానులు ప్రజాస్వామ్యం మీద గౌరవంతో వాటి మీద చర్చ జరిపారని కోరారు. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే బిజెపికి, మోడికి లెక్క లేనట్టుగా ఉందని పేర్కొన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తున్న సమయంలో, బిజెపి ఆ పార్టీ నాయకులూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్దికి కృషి చేయవలసిన సమయంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రతి టిడిపి కార్యకర్త చంద్రబాబుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిక్షణకు ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు జిల్లా నుండి తెనాలి, వినుకొండ, నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్, కో ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.