ఒంగోలు : నూతన పారిశ్రామిక విధానం దళితుల అభివృద్ధికి ఆటంకంగా ఉందని, ఈ విధానాన్ని పునఃసమీక్షించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్బాబుకు వినతి పత్రం అందజేశారు. నూతన పారిశ్రామిక చట్టంలో దళితులకు నష్టం చేస్తున్న అంశాలను ఆయనకు వివరించారు. రూ.75లక్షలుగా ఉన్న సబ్సిడీని మహిళలకు రూ.50లక్షలకు, పురుషులకు రూ.20లక్షలకు కుదించడం, సబ్సిడీని 45శాతం నుండి 35శాతం కుదించడం, రుణము మంజూరైన ఆరు నెలలకు జమ చేయాల్సిన సబ్సిడీ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత పరిశ్రమ నిర్వహణ తీరును బట్టి సబ్సిడీ మంజూరు చేస్తామని నూతన పారిశ్రామిక విధానంలో ప్రవేశపెట్టడం వల్ల దళితులకు బ్యాంకర్లు ఎవరూ రుణాలు ఇవ్వరని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు చాలా అంశాలు దళితులను అభివృద్ధికి దూరం చేసేలా నూతన విధానంలో ఉన్నాయని వివరించారు. నూతన పారిశ్రామిక విధానంపై పున పరిశీలన చేయాలని కోరారు.