Home ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల‌ కళ్ళలో వెలుగు కోసం…!

నిరుద్యోగుల‌ కళ్ళలో వెలుగు కోసం…!

625
0

అమ‌రావ‌తి : ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా పది లక్షల మంది. నిరుద్యోగుల‌ కళ్ళలో వెలుగు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పది లక్షల కుటుంబాలకు ల‌బ్ది క‌లిగించ‌నుంది. ఒకవైపు వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ… మరోవైపు లక్షల ససంఖ్యలో ప్రయివేటు రంగంలో ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త జీవితాలను ప్రసాదిస్తుంది. దీనికి కొనసాగింపుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. కనీస విద్యార్హత డిగ్రీ, 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది.

ఈ పథకం మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, కొల్లు రవీంద్రలు మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నిరుద్యోగ భృతి పొందే యువతీయువకులకు వివిధ శాఖల అనుసంధానంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునే సమయంలోనే వారికిష్టమైన మూడు రంగాలను ఎంచుకునే అవకాశం ఇస్తారు. దాని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలేమిటో చూసి వాటికి ఎంపికయ్యే విధంగా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు.

నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులను అప్రెంటి్‌సలుగా తీసుకునేలా చూస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్‌ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ… రాష్ట్ర ప్రభుత్వ అప్రెంటిస్‌ ప్రోత్సాహాన్ని అనుసంధానం చేసి నిరుద్యోగ యువతను పెద్దఎత్తున అప్రెంటీ్‌సలుగా తీసుకుంటారు. మరోవైపు నిరుద్యోగ భృతి అందుకునే యువతీయువకుల వివరాలతో జాబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఈ డేటా అందుబాటులో ఉంచి… ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలున్నవారిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. అటు కంపెనీల కోసం, ఇటు యువతీయువకులకు ఉద్యోగాల కల్పన కోసం సులభంగా ఉండేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ తయారుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు… నిరుద్యోగ భృతికోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలనీ మంత్రుల కమిటీ నిర్ణయించింది.

ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే… వారి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే నిరుద్యోగ భృతికి అర్హులా?.. కాదా? అనే విషయం తెలిసిపోతుంది. అనర్హులైతే కారణాలు కూడా చెప్పేలా ఈ వెబ్‌సైట్‌ ఉండాలని నిర్ణయించారు. ఒకవేళ అర్హత ఉన్నా భృతి రాకుంటే 1100కు ఫోన్‌ చేస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే నిరుద్యోగ భృతి అందిస్తారు. ఏడాదికి రూ.1200 కోట్లు దీనికోసం ఖర్చవుతాయని అంచనా. ఈ మార్గదర్శకాలన్నింటినీ ఆరో తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహలు వ్యక్తం అవుతున్నాయి.