Home ప్రకాశం బీసీలకు జగన్ పెద్దపీట : వైసీపీ కొండపి ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య

బీసీలకు జగన్ పెద్దపీట : వైసీపీ కొండపి ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య

375
0

టంగుటూరు(దమ్ము) : బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. ఎంబిసి కార్పోరేషన్ స్టేట్ డైరెక్టర్ గా మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు ఎన్నికైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతా ర్యాలీ జరిగింది. 4వ సచివాలయం నుండి ర్యాలీగా తన వర్గీయులతో బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డాక్టర్ వెంకయ్య చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా పుట్టా వెంకట్రావు మాట్లాడుతూ ఈరోజు టంగుటూరులో సంతోషకర విషయం అన్నారు. బలహీన వర్గానికి చెందిన తన రాజకీయ ప్రవేశం మొదట స్వర్గీయ పోతుల చెంచయ్య ఇంటివద్ద పనిచేస్తూ ప్రారంభమైనదన్నారు. ఈ క్రమంలో చెంచయ్య చనిపోయిన తర్వాత మాజీ శాసనసభ్యులు పోతుల రామారావుతో కొంతకాలం ఉన్నట్లు చెప్పారు. టంగుటూరు లోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, రైతాంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్న, మామ అంటూ అందర్నీ గౌరవంగా సంబోధిస్తూ ప్రతి ఒక్కరికి ఏ పని కావాలన్నా చెప్పే విధానంలో గ్రామంలో అలవాటు పడి ఉన్నానని అన్నారు. అది గమనించిన పోతుల రామారావు తనను పిఏగా నియమించుకున్నారని చెప్పారు. గ్రామంలో కొన్ని రోజులు ఆయన సర్పంచ్ గా చేసిన తర్వాత బీసీలకు వచ్చిన అవకాశంలో సర్పంచ్ గా తనకు అవకాశం ఇచ్చారన్నారు.

ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాను వ్యక్తిగతంగా ఆ రోజు పోతుల రామారావును గౌరవిస్తూ వారి సోదరులైన నరసింహారావు ను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ తనకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు తాను మాజీ సర్పంచ్ గా పిలువ బడుతున్నానంటే ఆ రోజు వారు ఇచ్చిన అవకాశమేనన్నారు. ఇది కాలక్రమేణ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం, తాను సర్పంచ్ గా ఉన్నప్పుడే ఆరోజు పోతులను విభేదించి వైఎస్సార్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అపోహలు తొలిగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ విషయం చెప్పడం జరిగిందన్నారు. ఆరోజు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను వ్యతిరేకించి అప్పటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు సూదనగుంట నారాయణ ఆధ్వర్యంలో అప్పటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. అయితే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు, జగన్ పాదయాత్ర సమయంలో సర్పంచ్ గా ఇక్కడ అన్ని విషయాలు ముందుండి తానే చూసుకున్నానన్నారు. ఐతే ఇప్పుడు వైస్సార్ పార్టీలో మెజారిటీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వాళ్లు ఇక్కడ పార్టీకి పట్టుగా ఉన్నారని చెప్పారు. ఐతే ఈ వర్గాలు రాజకీయంగా ఎందుకు వెనుకబడి పోతున్నారు. ఈ వర్గాలు గ్రామంలో రాజకీయంగా వైసీపీలో రాణించలేరా? ఇక్కడ ఈ వర్గాలు పార్టీని నడిపే సత్తా లేదా? లోపం ఎక్కడ జరుగుతుందో ఈసందర్భంగా వెంకయ్య చెప్పాలన్నారు. తనకు వెంకయ్య ద్వారా ఎంబిసి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల శ్రేయస్సు కొరకు పార్టీ ఏ పని అప్పజెప్పినా క్రమశిక్షణగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో చేసిన తనకు టంగుటూరు గ్రామ బాధ్యతలు అప్పజెప్పాలని నాయకులను కోరారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైసీపీ నాయకులు, వ్యాయామోపాధ్యాయులు తుల్లిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు పదవులు రావడం అరుదని అన్నారు. అన్నీ ఉన్నవాళ్లకే కాదు. పనిచేసే వాళ్లకు పట్టంకడతానన్న జగన్మోహనరెడ్డి పనిచేసిన పుట్టాకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ చిడిపోతు సుబ్బారావు, మల్లవరపు కోటిరెడ్డి, తుల్లిబిల్లి క్రాంతికుమార్, యరమాల నిరంజన్, కొమ్ము ప్రభుదాస్, సుబ్బారావు, రాములు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యవారయ్య వర్గానికి చెందిన పుట్టా కార్యక్రమానికి అయ్యవారయ్య వర్గం దూరంగా ఉండడం మండల పార్టీ అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబుతో సహా హాజరుకాకపోవడం, విజయభాస్కరరెడ్డి వర్గీయులు పాల్గొనడంతో ఏరోజు ఏవర్గం ఎటువైపు ఉంటుందోనని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.