Home ఆంధ్రప్రదేశ్ బీసీల అభ్యున్నతికి మాపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తాం : బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య

బీసీల అభ్యున్నతికి మాపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తాం : బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య

1060
0

చీరాల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై ఉంచిన బాధ్యతను బీసీల అభ్యున్నతికి కృషి చేస్తూ నెరవేరుస్తామని బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన అవ్వారు ముసలయ్య పేర్కొన్నారు. సోమవారం ఉదయం తాను బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బీసీల సమస్యలపై గత కొన్ని ఏళ్లుగా తాను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. తన అధ్యయనంలో గుర్తించిన బీసీల సమస్యలపై నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అందజేసినట్లు తెలిపారు. 1994 నుండి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా, అఖిలభారత పద్మశాలి సంఘం సభ్యులుగా, కోస్తా జిల్లాల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడుగా, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడిగా ఈ పాటికే బీసీల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశానని పేర్కొన్నారు. వీటన్నింటితో పాటు 2007 నుండి వివర్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ పేరుతో ఇప్పటివరకు 1500 మంది పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ ఇచ్చి ఉన్నత చదువులు చదివించినట్లు తెలిపారు.

ఇలా బీసీల అభివృద్ధికి తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను ఈ పదవికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. తన ఎంపికకు సహకరించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన తరగతుల సామాజిక అవగాహన కలిగిన కార్యకర్తల జాబితాలో తనను ఎంపిక చేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు విజయవాడ లోని బి.సి కమిషన్ కార్యాలయంలో చైర్మన్ అంబటి శంకరనారాయణ సమక్షంలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశాలలో వైసిపి రాష్ట్ర దళిత క్రైస్తవ విభాగం కార్యదర్శి నీలం సామేలు మోజెస్, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు పాల్గొన్నారు.