Home బాపట్ల మానవత చాటుకున్న నరేంద్ర వర్మ

మానవత చాటుకున్న నరేంద్ర వర్మ

14
0

బాపట్ల : శాసన సభ్యులు నరేంద్ర వర్మ ఐదేళ్ల చిన్నారి పట్ల మానవత చాటుకున్నారు. ఉదారతతో దత్తత తీసుకున్నారు. ఈరోజు నుండి ఆ చిన్నారి పూర్తి బాధ్యత తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదరించే వారు లేరు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేదు. చిన్నా భిన్నమైన ఆ కుటుంబంలో ఐదేళ్ల చిన్నారి పరిస్థితిని చూసి చలించిన ఆయన ఈ పాపను తాను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కృతం చేసి అక్కడికక్కడే తన ఆలోచనను అమలు చేసేశారు. ఈ నిర్ణయంతో ఆ ప్రాంత ప్రజలు చేతులు జోడించి ఆయన ఉదారతపై ప్రశంసల వర్షం కురిపించారు. మన వార్డు, మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒకటో వార్డు బేతనికాలనీలో పర్యటించిన ఆయన ఓ కుటుంబాన్ని పలకరించారు.

ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబ పరిస్థితిపై స్పందించారు. ఆ చిన్నారికి కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చాలాసేపు ఆ పాపతో ముచ్చటించారు. ఆ పాపతో మాట్లాడించారు. ఆ పాప కుటుంబ పరిస్థితి విన్న తర్వాత ఆయన ఆవేదన చెందారు. ఐదేళ్ల మేఘశ్రీ తోపాటు మరో ఆరేళ్ల అన్నయ్య, నాయనమ్మ సమక్షంలో ఉంటున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని కన్నతల్లి సత్తెనపల్లిలో అమ్మేసింది. విషయం తెలిసిన నాయనమ్మ అక్కడికి వెళ్లి పిల్లల్ని విడిపించుకుంది. ఇది జరిగిన తర్వాత ఆ కన్న తల్లి పిల్లల్ని వదిలించుకొని వెళ్ళిపోయింది. తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుతో సతమతం అవుతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. చిన్నారి మేఘశ్రీకి ఇప్పుడు కొండంత అండ లభించింది. జీవితానికి భద్రత లభించింది. కుటుంబానికి భరోసా దక్కింది. ఇవేమీ ఆ చిన్నారికి తెలియదు. ఒక చిన్న హృదయానికి ఒక పెద్ద మనసు ఆదుకుంది. హృదయానికి హత్తుకుంది. ఇప్పుడు ఆ పెద్ద మనసుకు చేతులు జోడించి ప్రజానీకం నమస్కరిస్తోంది.