ఒంగోలు : “కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళతం. ఎవ్వరివల్ల ఇబ్బందిలేదు. సర్వేల ప్రకారం గెలిచే అభ్యర్ధులకు సీట్లు ఇచ్చేవిధంగా అధినేత నిర్ణయాలు తీసుకుంటారు. అపోహలు వద్దు.“ అంటూ వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కొండేపి వైఎస్ఆర్‌సిపి నాయకులు వరికూటి అశోక్‌బాబును పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వచ్చిన ప్రకటనకు నిరసనగా అశోక్‌బాబు గత ఐదు రోజులుగా కొండేపి పార్టీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఐదోరోజున పోలీసులు జోక్యం చేసుకుని ఒంగోలు రిమ్స్‌కు తరలించడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు బాలినేని నివాసానికి వెళ్లి ప్రశ్నించడంతో స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రిమ్స్‌కు వచ్చారు. వైద్యశాలలో కూడా దీక్ష కొనసాగిస్తున్న అశోక్‌బాబుతో చర్చించారు. కార్యకర్తల మనోభావాలను అధినేత దృష్టికి తీసుకెళతామని, వైద్యం చేయించుకోవాలని సూచించారు. బాలినేని హామీతో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం విలేకర్లతో చర్చించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ….
బాలినేని : పార్టీనుండి సస్పెండ్ చేశారని అశోక్ బాబు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాడు. ప్రజల మనోభావాలను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది.
విలేకర్లు : జిల్లాలో గెలిచే కొన్నిప్రాంతాలు కూడా వైవి సుబ్బారెడ్డి వల్ల మీ పార్టీలో ఇబ్బంది జరుగుతుందని కార్యకర్తలు అంటున్నారు.
బాలినేని : అదేమి లేదు, జగన్మోహన్‌రెడ్డి సర్వేల ప్రకారం టిక్కెట్ ఇవ్వడం జరుగుతుంది. కాని వేరే ఎవరివల్ల (బాలినేని) నా వల్ల కానీ, ఆయన (వైవి సుబ్బారెడ్డి) వల్ల కానీ వుండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి సర్వేల ప్రకారం టిక్కెట్ ఇవ్వడం జరుగుతుంది.
విలేకర్లు : పార్టీ బహిష్కరణ అనేది నోటీసు ఏమీ ఇవ్వకుండా ఎలాచేశారు. అధికారికంగా కూడా రాలేదు. పార్టీ కార్యాలయం నుండి వచ్చిందే కానీ ఎవరి పేరుమీద రాలేదు.
బాలినేని : జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా పార్టీ కార్యాలయం నుండి వచ్చింది.
విలేకరులు : ఆధిపత్య ధోరణితోనే కొండపి నియోజకవర్గంలో కొంచెం ఇబ్బంది అయిందని, లేకపోతే కొండెపిలో మంచిఫలితమే ఉండేదని మీ పార్టీలోని చిన్న చిన్న నాయకులే చెబుతున్నారు? అధిష్టానం వద్ద కూడా?
బాలినేని : ఒక్కోసారి చిన్న చిన్నవి జరుగుతుంటాయి. తప్పకుండా వాటికి పరిస్కార మార్గాలనేవి ఉంటాయి. ఇక్కడ జరిగిన పరిణామాలన్నింటిని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం చేకూర్చుతాం.