Home ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం : వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం : వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని

482
0

ఒంగోలు : ”ఒక వీధిలో నీళ్లొస్తుంటే.. మరో బజారులో రావు. నాలుగడుగులు కాలువ తీస్తారు. ఆరడుగులు గుంతలు తీసి వదిలేస్తారు! సగం రోడ్డు వేసి ఆపేస్తారు. అదేమని అడిగితే నూటొక్క కారణాలు చెబుతారు! దోమలతో అల్లాడిపోతున్నాం! పట్టించుకునే దిక్కు లేదు.” అంటూ స్థానిక ప్రజలు వైసిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఎదుట వాపోయారు. శనివారం రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 50వ డివిజన్‌లోని వెంకటేశ్వరకాలనీ, జయప్రకాష్‌ కాలనీ, నెహ్రూ కాలనీల్లో పర్యటించారు.

ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే నగరంలోని అన్ని కాలనీల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికీ పింఛన్ల ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.48 వేల దాకా అందుతాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. లక్ష నుంచి రూ.పది లక్షలదాకా సాయం పొందే అవకాశమున్నట్లు బాలినేని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలందరికీ రూ.2 నుంచి రూ.5 లక్షలు వెచ్చించి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ పేద కుటుంబంలో పిల్లలను బడికి పంపినందుకు ఏటా రూ.15 వేలు అందిస్తామని చెప్పారు. ఇలా ప్రతీ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా ఏటా రూ.లక్ష నుంచి రూ. 5 లక్షలు లబ్ది పొందేట్లు జగన్‌ విధి విధానాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నగర అధక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్‌ అధ్యక్షుడు గల్లా దుర్గ, యరమాల చక్రపాణి, గల్లా శ్రీరాం, మారుతి, కండే రాములు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కొటికల రోశయ్య, పల్లా అనురాధ, బేతంపూడి రాజేశ్వరి, సుబ్బులు, నరాల రమణారెడ్డి, కండె రమణా యాదవ్‌ పాల్గొన్నారు.