Home సినిమా ‘బాహుబలి’ మళ్ళీ వస్తున్నాడు..!

‘బాహుబలి’ మళ్ళీ వస్తున్నాడు..!

450
0

‘బాహుబలి సిరీస్’… పేరుకి ప్రాంతీయ చిత్రమైనా అంతర్జాతీయ స్థాయిలో వసూళ్ళ కుంభవృష్టి కురిపించింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది. విజనరీ డైరెక్టర్ రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీతో వెండితెరపై అద్భుతాలు చేసిన ఈ సిరీస్… బుల్లితెరపైనా ప్రకంపనలు రేపింది. ‘బాహుబలి’ అనే బ్రాండ్‌ని చాలా రూపాల్లో జనాల్లోకి తీసుకెళ్ళిన జక్కన్న త్వరలో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడట. ఇంతకీ అదేమిటంటే రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ని సింగిల్ పార్ట్‌లో స్క్రీన్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. తొలి భాగం కథను ఇంట్రవెల్ ముందు వరకు, మలి భాగం కథను విశ్రాంతి తరువాత వచ్చేలా ఈ మేరకు ఎడిటింగ్ కూడా పూర్తయిందని టాక్.

‘బాహుబలి’ రెండు భాగాల మొత్తం నిడివి దాదాపు ఐదున్నర గంటలు ఉంటే సింగిల్ పార్ట్ వెర్షన్‌లో మూడు గంటల వరకు కుదిస్తున్నారట. అలాగే కొన్ని పాటలు, పెద్దగా ప్రాధాన్యం లేని సన్నివేశాలను తొలగించడమే కాకుండా అవసరమైన చోట అదనపు ఆకర్షణలను అద్దే ప్రయత్నం జరుగుతోందట. ఇప్పటికే ఈ మేరకు ట్రిమ్మింగ్ కూడా పూర్తయిందని, త్వరలోనే దక్షిణాది నాలుగు భాషల్లోనూ ఈ నయా వెర్షన్ రిలీజ్ అయ్యే అవకాశముందని టాక్. వాస్తవానికి, ‘బాహుబలి – ది కంక్లూజన్’ రిలీజ్‌కి మూడు వారాల ముందు ‘బాహుబలి – ది బిగినింగ్’ని రీ-రిలీజ్ చేశారు. వేయికి పైగా స్క్రీన్స్‌లో హిందీనాట విడుదలైన ఈ విజువల్ వండర్‌కి సెకండ్ రిలీజ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి ఒకే భాగంలో రానున్న ఈ సిరీస్ సెన్సేషన్… దక్షిణాదిన ఎలాంటి సంచలనాలకి కేంద్రబిందువుగా నిలుస్తుందో చూడాలి.