టంగుటూరు : బీసీ జయహో పేరుతో చంద్రబాబు బీసీలను నిట్ట నిలువునా మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. టంగుటూరులోని వైయస్ ఆర్సిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013లో ఎన్నికలకు ముందు 18అంశాలతో బీసీ డిక్లరేషన్ లో 10 వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తామని, చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని, యూనివర్సిటీ వైస్ చాన్సలర్, నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, రజకులను ఎస్సీ ఎస్టీల్లో చేస్తామనే 18హామీలలో ఏ ఒక్కటి ఈ నాలుగు సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇప్పుడు రాజమండ్రిలో జయహో బీసీ అని పెట్టి అనేక హామీలను గుప్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైయస్ జగన్ ప్రకటించిన హామీలను చంద్రబాబు వల్లె వేయడం బాబు దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. కొండెపి నియోజకవర్గంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. సాగర్ లో నీరు నిండుగా వున్నా, చెరువులు నింపుకోవడంలో ఎమ్మెల్యే స్వామి అలసత్వం వహించారన్నారు. ఆరుతడికి సాగునీరు, సాగర్ నీటి ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. శనగ, పొగాకు రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం చోద్యం చూస్తూ పొలాలను ఎండగట్టారన్నారు.
వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారప్రతినిధి బొట్ల రామారావు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రకటించిన యాదవ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తదితర హామీలను తప్పనిసరి స్థితిలో చంద్రబాబు ప్రకటించారని అన్నారు. ప్రజలు జగన్ పట్ల కృతజ్ఞతతో ఉన్నారని చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కాపులు, బీసీలకు వైరం పెట్టి రిజర్వేషన్ పేరుతో వైషమ్యాలు సృష్టించారని ఆరోపించారు. మళ్లీ నేడు ఈబిసిలకు కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్ లో 5% కాపులకు అని మళ్ళీ ఆ వర్గాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఏది ఏమైనా జగన్ తోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి చేకూరుతుందని చెప్పారు. జవాబుదారీతనంలేని టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూధనగుంట శ్రీహరి, సూరం రమణారెడ్డి, చింతపల్లి హరి, కె ప్రభుదాసు, నత్తల క్రాంతి, డి వినోద్, ఆర్ రమేష్, కొర్రకూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.