Home Uncategorized విభ‌జ‌న హామీల‌పై చ‌ర్చిద్దాం : చంద్రబాబుతో ఫోన్‌లో అమిత్‌షా!

విభ‌జ‌న హామీల‌పై చ‌ర్చిద్దాం : చంద్రబాబుతో ఫోన్‌లో అమిత్‌షా!

413
0

హైదరాబాద్‌: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేశారు. ఇద్ద‌రూ ఫోనులో విభజన హామీలపై చర్చించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 5న మరోసారి హామీలపై చర్చిద్దామని ఆయన చెప్పడంతో అందుకు సీఎం స్పందించిన‌ట్లు తెలిసింది. కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో బృందాన్ని చర్చలకు పంపుతానని సూచించారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన హామీలను అమలు చేయాలి. మా పోరాటం మీపై కాదు. ప్రజల డిమాండ్‌ కోసమే మేం పట్టుబడుతున్నాం. హామీల సాధన విషయంలో రాజీలేదు’ అని అమిత్‌షాతో చంద్రబాబు అన్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 5 నిమిషాల పాటు ఫోను సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు నేతృత్వంలో జరిగిన చర్చల సారాంశం తాను విన్నానని సీఎం ఆయనకు సంక్షిప్తం చేసిన‌ట్లు సమాచారం. ఇంకా కావాల్సిన వివ‌రాల‌ను సుజనా చౌదరి బృందంతో పంపించనున్నట్లు సీఎం చంద్ర‌బాబు అమిత్‌షాతో అన్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రం బడ్జెట్‌లో ఎపికి కేటాయింపులు చేయకపోవడంపై బిజెపి మిత్ర‌ప‌క్ష‌మైన టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమైంది. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభ‌జ‌న చేసి న్యాయంగా రావాల్సిన నిధుల‌ను కూడా ఇవ్వ‌కుండా రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసినట్లు తెలిసింది. ఈ విష‌యంలో టిడిపి నేత‌ల‌పై ప్ర‌జ‌ల‌నుండీ ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మలి దశ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను సైతం స్తంభింపజేయడంతో పాటు రాష్ట్ర హక్కులను సాధించే వరకూ కేంద్రంతో పోరాటానికి సన్నద్ధమవ్వాలని టిడిపి నేత చంద్ర‌బాబు దిశానిర్ధేశం చేయ‌డంతో ఆందోళ‌న బాట ప‌ట్టారు. అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసి పోరాటంలో భాగస్వాముల్ని చేయాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శుక్ర‌వారం నిర్ణయం తీసుకోవ‌డంతో అమిత్‌షా ఫోన్‌ చేయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పోరాటంలో రాజీ పడొద్దు
రాష్ట్ర హక్కుల సాధన పోరాటంలో రాజీ పడొద్దని ముఖ్య‌మంత్రి చంద్రబాబు టిడిపి ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలకు సూచించిన‌ట్లు సమాచారం. అమిత్‌షాతో ఫోనులో మాట్లాడిన అనంత‌రం చంద్ర‌బాబు ప‌లువురు టిడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమిత్‌ షా తనకు ఫోన్‌చేసిన విషయాన్ని నేత‌ల‌తో పంచుకున్నారు. చర్చలు జరుగుతున్న‌ప్ప‌టికీ హక్కుల సాధనలో రాజీ ప‌డాల్సిన ప‌నిలేద‌ని నాయ‌కుల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం.