Home బాపట్ల బిపిఎస్‌పై అవగాహన కల్పించాలి

బిపిఎస్‌పై అవగాహన కల్పించాలి

8
0

బాపట్ల (Bapatla) : భవన యజమానులకు బిపిఎస్ 2025పై అవగాహన కల్పించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పి మధుకుమార్ (Gunturu RDD P Madhu Kumar) అన్నారు. బిపిఎస్ 2025 (BPS) స్కీంపై బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి పురపాలక సంఘాల పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది, లైసెన్స్‌డు టెక్నికల్ పర్సన్లు, లైసెన్స్‌డు ఇంజనీర్లకు మునిసిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జిఒ 225 ప్రకారం 1985 జనవరి 1 నుండి 2025 మార్చి 31 మధ్య నిర్మించిన అనధికార భవనాలు బిపిఎస్‌లో క్రమబద్దీకరించు కోవచ్చని అన్నారు. పట్టణ ప్రణాళికా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి అనధికార నిర్మాణాలు గుర్తించాలని చెప్పారు. బిపిఎస్ 2025 ప్రకారం క్రమబద్దీకరించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నివాస, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక భవనాలకు వేర్వేరుగా రుసుం చెల్లించి తమ నిర్మాణాలు చట్టబద్ధం చేసుకోవచ్చని తెలిపారు. 1997కు ముందు నిర్మించిన భవనాలకు అపరాధ రుసుంలో 25శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మురికివాడల్లో ఇళ్లకు రుసుంలో 50శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. అనధికార నిర్మాణాలు సక్రమం చేసుకోవడానికి ప్రభుత్వం అందించిన చివరి అవకాశమని తెలిపారు. సదస్సులో కమిషనర్ రఘునాధరెడ్డి, బావుడా ప్లానింగ్ అధికారి పి శోభన్ బాబు, గుంటూరు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జె పూర్ణచంద్రారెడ్డి, బాపట్ల ఎస్‌ మల్లిఖార్జునరావు, చీరాల, అద్దంకి, రేపల్లె ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.