Home బాపట్ల హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి

హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి

11
0

చీరాల (DN5 News) : దళితులపై జరుగుతున్న అన్యాయం, కులవివక్షను ఎదుర్కొనేందుకు చట్టాలపై సమగ్ర అవగాహన అత్యంత అవసరమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రఘురామ్ అత్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ప్రతినిధులకు ‘దళితులు, చట్టాలు’ అనే అంశంపై మాల్యాద్రి మాట్లాడారు.

అన్యాయం, వివక్షను అరికట్టేందుకు చట్టాలు రూపొందించినప్పటికీ వాటి ప్రయోజనం ప్రజలకు పూర్తిగా అందడం లేదని తెలిపారు. దళితులపై జరుగుతున్న కులవివక్ష, దాడులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలు, దళితవాడల్లో సంఘటితంగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం సాధ్యమవుతుందని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకువచ్చిన కీలకమైన చట్టమని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం అమలులో అనేక ప్రాంతాల్లో పోలీసులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపడం, బాధితులకు సరైన రక్షణ కల్పించకపోవడం, పరిహారం అందించడంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యలు ఎదుర్కొనేందుకు సంఘటిత పోరాటాలు అవసరమని అన్నారు.

కులవివక్ష నిర్మూలనకు కులాంతర వివాహాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. అలాంటి వివాహాలపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, వివక్షత తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం, న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడటం కెవిపిఎస్ బాధ్యతని అన్నారు.

దళితులపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలో తమ సంఘం ముందుండి పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మతం, మతోన్మాదం, హిందుత్వ ప్రమాదం, నేటి సవాళ్లు అనే అంశంపై సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడారు. అనంతరం సోషల్ మీడియా ప్రాధాన్యతపై ఎల్ఐసి నాయకులు కర్లపాలెం రవికిరణ్ వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు శిక్షణా తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాలు, రంగమ్మ, చీరాల కెవిపిఎస్ నాయకులు ఎల్‌ జయరాజు పాల్గొన్నారు.